బెంగళూరు: ప్రతికూల పరిస్థితుల్లోనూ ఒత్తిడిని చిత్తుచేస్తూ ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్‌లు ఆడి భారత జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించిన టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తాను కెప్టెన్సీ ఎందుకు వదిలేయాల్సి వచ్చిందనే దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ జట్టుకు సుమారు ఎనిమిదేండ్లు, ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీకి తొమ్మిదేండ్లు సారథిగా పనిచేసిన తాను ఒత్తిడి వల్లే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నానని వెల్లడించాడు. ఆర్సీబీ విడుదల చేసిన ‘బోల్డ్ డైరీస్’ వీడియోలో కోహ్లీ మాట్లాడుతూ.. ‘భారత జట్టుకు సుమారు ఏడేనిమిదేండ్లు, ఆర్సీబీకి 9 ఏండ్లు సారథిగా ఉన్నా. నేను ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ నా మీద భారీ అంచనాలుండేవి. నా ఆటతీరు, సారథ్య సామర్థ్యంపై నిత్యం చర్చ జరుగుతూ ఉండేది. బ్యాటింగ్‌లో రాణిస్తే కెప్టెన్సీపై.. నాయకుడిగా సఫలమైతే నా బ్యాటింగ్‌పై.. ఇలా 24X7 నాపై కండ్లుండేవి. అది నాకు చాలా కష్టంగా అనిపించింది. ఒకానొక దశలో నేను తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. నా క్రికెట్ కెరీర్‌పై మరొకరు వేలెత్తి చూపకుండా ఉండాలని, స్వేచ్ఛగా ఆడాలని ఆ సమయంలో నేను నిశ్చయించుకున్నా’ అని అన్నాడు.