ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్.. త్వరలోనే మరో సెంచరీ చేస్తాడని మాజీ క్రికెటర్, ప్రముఖ అనలిస్ట్ ఆకాష్ చోప్రా విశ్లేషించాడు. ముంబైతో జరిగిన మ్యాచ్ రాహుల్ కెరీర్లో 100వ ఐపీఎల్ మ్యాచ్. దానిలో 103 పరుగులతో అజేయంగా నిలిచిన రాహుల్.. త్వరలోనే మరో సెంచరీ చేస్తాడని ఆకాష్ అభిప్రాయపడ్డాడు.
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోబ్ బట్లర్ ఇప్పటికే ఈ ఐపీఎల్లో రెండు సెంచరీలతో సత్తా చాటిన సంగతి తెలిసిందే. రాహుల్ కూడా ఆ ఫీట్‌ను సులభంగా సాధించగలడని, ప్రస్తుతం అతను అలాంటి ఫామ్‌లో ఉన్నాడని ఆకాష్ చెప్పాడు. ‘‘ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ మూడు రకాల పాత్రలు పోషించాడు. ఓపెనర్, మిడిలార్డర్ బ్యాటర్, అలాగే ఫినిషర్ పాత్రల్లో మెరిశాడు.
ఒక్క సెంచరీతో అతను సంతృప్తి చెందుతాడని నేను అనుకోవడం లేదు. అతను భవిష్యత్తులో కూడా ఇలాగే మరిన్ని భారీ స్కోర్లు చేస్తాడు’’ అని పేర్కొన్నాడు. రాహుల్‌ను చూసిన తర్వాత మరో ఓపెనర్ క్వింటన్ డీకాక్ కూడా భారీ స్కోర్లు చేయడానికే ప్రయత్నిస్తాడని ఊహించాడు.