నార్తాంప్టన్: ఇంగ్లండ్‌తో కీలక ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తాను ఆడిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భాగంగా శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో రాహుల్.. (168 బంతుల్లో 116, 15 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో కదంతొక్కగా ధ్రువ్ జురెల్ (52), కరుణ్ నాయర్ (40) రాణించారు.
ఈ త్రయం మెరవడంతో మూడు సెషన్ల ఆట ముగిసే సమయానికి భారత్.. 62 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. టెస్టులలో రోహిత్ శర్మ రిటైర్మెంట్తో ఖాళీ అయిన ఓపెనర్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న అనుమానాలను నివృత్తి చేస్తూ రాహుల్ సెంచరీతో బదులివ్వడంతో రాబోయే సిరీస్‌లో అతడినే ఓపెనర్‌గా పంపే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. గత మ్యాచ్‌లో సెంచరీతో రాణించిన కరుణ్ నాయర్ సైతం రెండో మ్యాచ్‌లోనూ మెరవడంతో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ తుది జట్టులోనూ అతడికి చోటు దక్కే అవకాశముంది.