గాయంతో సుమారు రెండు నెలలుగా ఆటకు దూరమైన టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ వెస్టిండీస్ పర్యటన నుంచి కూడా తప్పుకున్నాడు. ఇటీవలే కరోనా బారిన పడిన రాహుల్.. ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చినా వెస్టిండీస్‌కు వెళ్లడం లేదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. కరోనా నెగిటివ్ వచ్చినా అతడు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఫిట్నెస్ టెస్టులలో పాల్గొనాల్సి ఉంది.
వెస్టిండీస్‌తో బుధవారం మూడో వన్డే ముగిసిన తర్వాత భారత జట్టు.. శుక్రవారం (జులై 29) నుంచే ఐదు మ్యాచుల టీ20 సిరీస్ వేట ప్రారంభించనుంది. ఆసియా కప్‌నకు ముందు జరుగుతున్న ఈ సిరీస్ భారత జట్టుకు టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో కూడా కీలకం కానున్నది. దీంతో ఒక్క విరాట్ కోహ్లీ తప్ప సీనియర్లంతా ఈ సిరీస్ ఆడుతున్నారు.
అయితే వారం రోజుల క్రితం ఎన్సీఏలో శిక్షణ తీసుకుంటూ కరోనా బారిన పడ్డ రాహుల్.. ఈ సిరీస్ ప్రారంభం వరకు కోలుకుంటాడని, ఫిట్నెస్ సాధిస్తాడని భావించారు టీమిండియా ఫ్యాన్స్. కరోనా నుంచి బయటపడ్డ కెఎల్ మాత్రం ఇంకా ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. దానికి ఇంకా సమయముంది. కానీ టీమిండియా.. విండీస్‌తో శుక్రవారం నుంచే టీ20 సిరీస్ ప్రారంభించనున్న నేపథ్యంలో రాహుల్ విండీస్‌కు వెళ్లడం వీలు కాదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అతడి స్థానాన్ని ఎవరైనా భర్తీ చేస్తారా..? అనే ప్రశ్నకు బోర్డు ప్రతినిధి స్పందిస్తూ.. ‘అలాంటిదేమీ లేదు’ అని వ్యాఖ్యానించాడు.