KL Rahul : ఐపీఎల్ (IPL) లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi capitals) వికెట్ కీపర్, బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) టాప్-10లోకి దూసుకెళ్లాడు. గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ఈ ఫీట్ సాధించాడు. దాంతో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) స్కిప్పర్ అజింక్య రహానే, ఆర్సీబీ మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్‌లను జాబితాలో వెనక్కి నెట్టాడు.
గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ 53 బంతుల్లో 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతో ఐపీఎల్ కెరీర్లో రాహుల్ మొత్తం పరుగుల సంఖ్య 4,868కి చేరింది. మొత్తం 135 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ 126 ఇన్నింగ్స్‌లో 135.67 స్ట్రైక్ రేట్, 46.36 సగటుతో ఈ పరుగులు సాధించాడు. అందులో నాలుగు సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోర్ 132 నాటౌట్.
కాగా 2020 ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరఫున ఆడిన కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఆ సీజన్లో మొత్తం 14 మ్యాచ్‌లలో 14 ఇన్నింగ్స్ ఆడాడు. 129.34 స్ట్రైక్ రేట్‌తో 55.83 సగటుతో మొత్తం 670 పరుగులు చేశాడు. అందులో ఐదు అర్ధసెంచరీలు ఉన్నాయి.