ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్ ఒక మ్యాచ్‌లో ఆకుపచ్చ జెర్సీ ధరించి మ్యాచ్ ఆడే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు 2024లో కూడా కలిసిరాలేదు. ఇప్పటికే ఈ సీజన్లో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాన నిలిచిన ఆర్సీబీ.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లోనూ ఒక్క పరుగు తేడాతో ఓడి తమ అపజయాల పరంపరను కొనసాగించింది. బంతి బంతికీ ఆధిక్యం చేతులు మారుతూ వచ్చిన ఉత్కంఠ పోరులో కోల్‌కతా.. 222 పరుగులు చేసినా గెలుపు కోసం చివరి బంతిదాకా వేచి చూడాల్సి వచ్చింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సమిష్టిగా రాణించిన కేకేఆర్ ఐదో విజయాన్ని దక్కించుకోగా ఆర్సీబీ ఏడో ఓటమితో ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినట్టే!
IPL | కోల్‌కతా: ఐపీఎల్-17లో వరుస పరాభవాలతో నిరాశపరుస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఖాతాలో ఏడో (వరుసగా ఆరు) ఓటమి. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ ఓటమిపాలైంది. కోల్‌కతా నిర్దేశించిన 223 పరుగుల ఛేదనలో విల్ జాక్స్ (32 బంతుల్లో 55, 4 ఫోర్లు, 5 సిక్సర్లు), రజత్ పాటిదార్ (23 బంతుల్లో 52, 3 ఫోర్లు, 5 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (18 బంతుల్లో 25, 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాటానికి తోడు ఆఖర్లో కర్ణ్ శర్మ (7 బంతుల్లో 20, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించినా ఆ జట్టు 20 ఓవర్లలో 221 పరుగుల వద్దే ఆగిపోయింది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 50, 7 ఫోర్లు, 1 సిక్స్), ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 48, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. బ్యాట్‌తో (20 బంతుల్లో 27 నాటౌట్, 4 ఫోర్లు) పాటు బంతి (3/25)తోనూ మెరిసిన ఆండ్రీ రస్సెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
భారీ ఛేదనలో ఆర్సీబీ బ్యాటర్లు ఆది నుంచే దంచుడు మంత్రాన్ని పఠించారు. కోహ్లీ (7 బంతుల్లో 18, 1 ఫోర్, 2 సిక్సర్లు) తొలి ఓవర్లోనే 4, 6తో బాదుడుకు గేట్లు ఎత్తేశాడు. కానీ హర్షిత్ రాణా 2వ ఓవర్లో వివాదాస్పద నిర్ణయంతో పెవిలియన్ చేరాడు. నడుము కంటే ఎక్కువ ఎత్తులో వచ్చిన బంతిని ఆడబోయి హర్షిత్కే క్యాచ్ ఇచ్చాడు. డుప్లెసిస్ (7) విఫలమైనా జాక్స్, పాటిదార్లు కేకేఆర్ బౌలర్లను ఆటాడుకున్నారు. స్టార్క్ 4వ ఓవర్లో జాక్స్.. మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో చెలరేగితే సుయాశ్ శర్మ పదో ఓవర్లో పాటిదార్ 4, 6, 6, 4తో రెచ్చిపోయాడు. 29 బంతుల్లో జాక్స్ అర్ధ సెంచరీ పూర్తికాగా పాటిదార్ 21 బంతుల్లోనే దానిని పూర్తిచేశాడు. వీళ్లిద్దరి దూకుడుతో ఆర్సీబీ 11 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది.
అనిశ్చితికి మారుపేరైన ఆర్సీబీ మరోసారి తడబాటుకు గురైంది. 2 ఓవర్ల వ్యవధిలో ఆ జట్టు నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. రస్సెల్ వేసిన 12వ ఓవర్లో మొదటి బంతికి జాక్స్.. రఘువంశీకి క్యాచ్ ఇవ్వగా నాలుగో బంతికి పాటిదార్.. రాణా చేతికి చిక్కాడు. సునీల్ నరైన్.. గ్రీన్ (6), లోమ్రర్ (4)ను బుట్టలో వేసుకున్నాడు. ప్రభుదేశాయ్ (18 బంతుల్లో 24, 3 ఫోర్లు)తో కలిసి కార్తీక్ పోరాడటంతో ఆర్సీబీ విజయానికి దగ్గరగా వచ్చింది. 19వ ఓవ ర్లో కార్తీక్‌ను ఔట్ చేసి రస్సెల్ మరోసారి బెంగళూరును దెబ్బకొట్టాడు.
ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయడం ద్వారా సునీల్ నరైన్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో ఒక ఫ్రాంచైజీ తరఫున ఆడుతూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఈ విండీస్ వీరుడు రికార్డులకెక్కాడు. కేకేఆర్‌కు 169 మ్యాచ్‌లలో నరైన్.. 172 వికెట్లు పడగొట్టాడు. గతంలో ఈ రికార్డు ముంబై ఇండియన్స్ (ఎంఐ) తరఫున ఆడిన లంక దిగ్గజ పేసర్ లసిత్ మలింగ పేరిట ఉండేది. మలింగ.. ఎంఐ తరఫున 170 వికెట్లు తీశాడు. బుమ్రా (ముంబై – 158), భువనేశ్వర్ (ఎస్ఆర్హెచ్-158) తదుపరి స్థానాల్లో నిలిచారు.
కార్తీక్ ఔట్ అవడంతో ఆర్సీబీ కథ ముగిసిందని అనుకున్నా స్టార్క్ వేసిన చివరి ఓవర్లో కర్ణ్ శర్మ.. తొలి నాలుగు బంతుల్లో 3 సిక్సర్లు కొట్టి మళ్లీ ఆ జట్టును పోటీలోకి తెచ్చాడు. దీంతో ఆర్సీబీ విజయానికి 2 బంతుల్లో 3 పరుగులు అవసరమవడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కానీ దురదృష్టం ఆర్సీబీని మరోసారి వెంటాడింది. ఐదో బంతికి కర్ణ్.. స్టార్క్‌కే రిటర్న్ క్యాచ్ ఇవ్వగా ఆఖరి బంతికి ఫెర్గూసన్ రెండో పరుగు కోసం యత్నించి రనౌట్ అవడంతో కోల్‌కతా ఊపిరి పీల్చుకుంది. ఆర్సీబీకి మరోసారి గుండె పగిలింది.
మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా బ్యాటర్లు ఆర్సీబీ బౌలర్లపై దాడికి దిగారు. ఈ సీజన్లో జోరుమీదున్న నరైన్ (10), రఘువంశీల (3)లు విఫలమైనా ఓపెనర్ ఫిల్ సాల్ట్ మాత్రం తనదైన రీతిలో చెలరేగాడు. సిరాజ్ తొలి ఓవర్లోనే 6,4 తో పరుగుల ఖాతా తెరిచిన అతడు ఫెర్గూసన్‌కు నాలుగో ఓవర్లో చుక్కలు చూపించాడు. 6, 4, 4, 6, 4, 4 తో అతడి విధ్వంసం పతాకస్థాయికి చేరింది. సాల్ట్‌ను సిరాజ్ ఔట్ చేసినా మిడిల్ ఓవర్స్‌లో శ్రేయస్ అయ్యర్ పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేశాడు. రింకూ సింగ్ (16 బంతుల్లో 24, 2 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. అయ్యర్ నిష్క్రమించడంతో రమణ్‌దీప్ సింగ్ క్రీజులోకి వచ్చాడు. అతడు సిరాజ్ 19వ ఓవర్లో 6, 6, 4 బాదడంతో కేకేఆర్ స్కోరు 200 దాటింది. ఆఖరి ఓవర్లో రస్సెల్ రెండు, రమణ్‌దీప్ ఓ బౌండరీతో కేకేఆర్ మరోసారి భారీ స్కోరు సాధించింది.
1 ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ గెలవడం ఐపీఎల్లో కేకేఆర్‌కు ఇదే ప్రథమం. ఒక్క పరుగు తేడాతో ఓడటం ఆర్సీబీకి తొలిసారి.
కోల్‌కతా : 20 ఓవర్లలో 222/6 (శ్రేయస్ 50, సాల్ట్ 48, గ్రీన్ 35/2, దయాల్ 2/56),
బెంగళూరు : 20 ఓవర్లలో 221 ఆలౌట్ (జాక్స్ 55, రజత్ 52, రస్సెల్ 3/25, రాణా 2/33)