లేహ్: ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో తెలంగాణ యువ స్కేటర్ తాళ్లురి నయన శ్రీ కొత్త చరిత్ర లిఖించింది. వరుసగా మూడో ఏడాది వింటర్ గేమ్స్‌లో పసిడి పతకంతో మెరుపులు మెరిపించింది. జమ్ము కశ్మీర్‌లోని లేహ్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా వింటర్గేమ్స్లో 15 ఏండ్ల నయన సత్తాచాటింది. శుక్రవారం జరిగిన మహిళల 500మీటర్ల షార్ట్ ట్రాక్ ఈవెంట్ రేసును నయన 1:01:35 సెకన్లలో ముగించి స్వర్ణం కైవసం చేసుకుంది.
ఇదే విభాగంలో ప్రతీక్ష(1:02:84సె, కర్నాటక), స్వరూప దేశ్ము ఖ్(1:03:15సె, మహారాష్ట్ర) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. 2023 నుంచి వరుసగా మూడోసారి వింటర్గేమ్స్లో నయన పసిడి పతకాలు కైవసం చేసుకోవడం విశేషం. గతేడాది ఖేలోఇండియాలో ఈ యువ స్కేటర్ రెండు స్వర్ణాలు సాధించగా, జకార్తలో జరిగిన ఏషియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్కేటింగ్‌లో అదరగొట్టింది. ‘గుల్మార్గ్లో 2023 నుంచి తొలి స్వర్ణం నుంచి ఇప్పుడు హ్యాట్రిక్ సాధించడం చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొంది.