Usman Khawaja : ఆస్ట్రేలియా క్రికెట్లో ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) శకం ముగిసింది. టెస్టు స్పెషలిస్ట్‌గా ఆసీస్ విజయాల్లో కీలకమైన ఖవాజా తన సుదీర్ఘ కెరీర్‌ను చాలించాడు. యాషెస్ సిరీస్(Ashes Series)లో చివరిదైన సిడ్నీ టెస్టు (Sydney Test)లో విజయంతో వీడ్కోలు పలికాడు. ఈ మ్యాచ్‌కు ముందే రిటైర్మెంట్ వార్తను వెల్లడించిన ఈ లెఫ్ట్హ్యండర్ తన సొంత మైదానంలో సహచరులు, అభిమానుల సమక్షంలో రెడ్ బాల్ క్రికెట్‌కు అల్విదా చెప్పాడు. ఈ గ్రౌండ్‌లోనే 15 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌పైనే అరంగేట్రం చేసిన ఖవాజా.. సగర్వంగా టెస్టుల నుంచి సెలవు తీసుకున్నాడు.
పాకిస్థాన్‌లో పుట్టిన ఖవాజా ఆస్ట్రేలియా టెస్టు జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. అతడికి ఐదేళ్లున్నప్పుడు వారి కుటుంబం కంగారూ దేశానికి వలస వచ్చింది. క్రికెట్ మీద ఇష్టం పెంచుకున్న ఖవాజా ముస్లిం అయినందుకు అవకాశాల కోసం నిరీక్షించాడు. ఎట్టకేలకు 2011లో రికీ పాంటింగ్ (Ricky Ponting) స్థానంలో జట్టులోకి వచ్చిన ఖవాజా ఆసీస్ క్రికెట్లో చెరగని ముద్ర వేశాడు. తన ప్రయాణం మొదలైన చోటే అతడు విడ్కోలు పలకడం విశేషం.
Special moments for Usman Khawaja with his family following his retirement from Test cricket ❤️ pic.twitter.com/cbw0kJnpbL
— ESPNcricinfo (@ESPNcricinfo) January 8, 2026
‘చివరి మ్యాచ్‌లో విన్నింగ్ రన్స్ కొట్టాలనుకున్నా. కానీ, సాధ్యపడలేదు. విజయంతో వీడ్కోలు పలకడం సంతోషంగా ఉంది. నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటా. కానీ, ఈ టెస్టు సిరీస్‌లో భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టంగా తోచింది. నా కెరీర్ ఆసాంతం ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకున్నందుకు గర్వంగా ఉంది. కానీ, ఈసారి మాత్రం నేను ఏకాగ్రతతో ఆడలేకపోయాను’ అని ఖవాజా తెలిపాడు.
ఆస్ట్రేలియాకు ఆడిన గొప్ప క్రికెటర్లలో ఖవాజా ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే స్వతహాగా వివక్షను అనుభవించిన అతడు.. అన్యాయాన్ని సూటిగా ప్రశించేవాడు. నల్లజాతీయుల హక్కులను కాలరాయడాన్ని తప్పుపట్టిన అతడు ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్'(Black Lives Matters)కు మద్దతు పలికాడు. అంతేకాదు ‘గాజా’లో హింసను నిరసిస్తూ నల్లబ్యాడ్జితో మైదానంలోకి దిగి.. ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు.
Usman Khawaja receives a guard of honour as he walks out to bat for the final time in Test cricket 🙌 pic.twitter.com/VAQ1Cy1Bjf
— ESPNcricinfo (@ESPNcricinfo) January 8, 2026
దిగ్గజ ఓపెనర్లలో ఒకడైన ఖవాజా.. డేవిడ్ వార్నర్(David Warner)తో కలిసి యాషెస్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. రెండేళ్ల క్రితం వార్నర్ రిటైర్మెంట్ తర్వాత అతడికి తగ్గ జోడీ దొరకలేదు. దానికి తోడు ఫామ్ లేమి కూడా అతడి కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టేలా చేసింది. ఈసారి యాషెస్ సిరీస్‌లో విధ్వంసక ఆటగాడు ట్రావిస్ హెడ్ ఓపెనర్‌గా రాణించడంతో ఖవాజా మిడిల్ ఆర్డర్లో రావాల్సి వచ్చింది. పెర్త్ టెస్టులో వెన్నునొప్పితో బాధపడిన అతడిపై సానుభూతి కంటే విమర్శలే ఎక్కువ రావడంతో చాలా బాధపడ్డాడు. ‘స్వార్థ పరుడు. జట్టు కంటే వ్యక్తిగత ప్రయోజనాలే అతడికి ముఖ్యం’ అని మరే క్రికెటర్‌పై రాని విధంగా ఖవాజాను టార్గెట్ చేసింది ఆసీస్ మీడియా, మాజీ క్రికెటర్లు. దాంతో, నొచ్చుకున్న అతడు ఇక వీడ్కోలుకు వేళైందని నిర్ణయించుకున్నాడు.
చివరిసారిగా బ్యాటింగ్‌కు వచ్చిన ఖవాజాకు ఇంగ్లండ్ ఆటగాళ్లు ‘గార్డ్ ఆఫ్ హానర్’తో గౌరవించారు. ఆఖరి మ్యాచ్‌లో సెంచరీ కొట్టాలనుకున్న అతడి కల ఫలించలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 17, రెండో ఇన్నింగ్స్‌లో 6 పరుగులతో నిరాశపరిచాడు. మ్యాచ్ అనంతరం మైదానంలో తన భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో ఖవాజా ఫొటోలు దిగాడు. మొత్తంగా 88 టెస్టుల్లో 48.82 స్ట్రయిక్ రేటుతో16 సెంచరీలు, 28 అర్ధ శతకాలు సాధించాడు. అత్యధిక స్కోర్ 232. 14సార్లు నాటౌట్‌గా నిలిచాడు. చురుకైన ఫీల్డరైన యుజ్జీ 68 క్యాచ్‌లు పట్టాడు.