Karun Nair | కరుణ్ నాయర్ అంతర్జాతీయ క్రికెట్లోకి మరోసారి ఎంట్రీ ఇవ్వనున్నాడు. డొమెస్టిక్ సీజన్లో అద్భుతంగా రాణించి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దాంతో ఇద్దరు సీనియర్ల రిటైర్మెంట్.. కీలక ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఈ పర్యటనకు ముందు ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత-ఏ జట్టులోనూ చోటు దక్కింది. కీలక మ్యాచ్‌లకు ముందు సన్నాహకంగా ఎంపిక చేయగా.. బ్యాటింగ్‌తో అద్భుతంగా రాణించాడు. ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్ట్‌లో డబుల్ సెంచరీ చేరశాడు. కాంటర్బరీలో ఇండియా-ఏ-ఇంగ్లాండ్ లయన్స్ మధ్య నాలుగు రోజుల మ్యాచ్ నిన్న మొదలైన విషయం తెలిసిందే.
భారత సీనియర్ జట్టు పర్యటనకు ముందు సన్నాహకంగా ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం బీసీసీఐ పలువురు ఆటగాళ్లను పంపింది. తొలి మ్యాచ్‌లో కరుణ్ మూడవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. తొలిరోజునే సెంచరీ చేశాడు. మొదటిరోజు ఆట ముగిసే వరకు 186 పరుగులతో అజేయంగా నిలిచాడు. రెండోరోజు ఫోర్ కొట్టి డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. రెండోరోజు టీమిండియా 557 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. కరుణ్ నాయర్ 281 బంతుల్లో 26 ఫోర్లు, సిక్సర్ తో 204 పరుగులు చేసి.. జమాన్ అక్తర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. భారత్ 51 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వర్ వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి కరుణ్ నాయర్ మూడో వికెట్‌కు 181 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సర్ఫరాజ్ తృటిలో సెంచరీ మిసయ్యాడు. 119 బంతుల్లో 13 ఫోర్ల సహాయంతో 92 పరుగులు చేసిన తర్వాత పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కరుణ్ నాల్గవ వికెట్‌కు ధ్రువ్ జురెల్‌తో కలిసి 195 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 120 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ తో 94 పరుగులు చేసిన తర్వాత జురెల్ అవుట్ అయ్యాడు. ఇక తెలుగు ఆటగాడు నితీశ్‌రెడ్డి ఏడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఈ డబుల్ సెంచరీతో చేయడంతో కరుణ్ నాయర్‌కు జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తుది జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. మూడు లేదంటే నాలుగు, ఐదోస్థానాల్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉన్నది. విరాట్, రోహిత్ శర్మ టెస్ట్‌ల నుంచి రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ ఇద్దరు తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశాలున్నాయి. చాలారోజుల పాటు టీమిండియాకు దూరమైన కరుణ్ నాయర్.. డొమెస్టిక్ క్రికెట్లో భారీగా శ్రమించాల్సి వచ్చింది. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కింది. జూన్ 20న ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో మైదానంలోకి దిగితే.. ఎనిమిదేళ్ల తర్వాత భారత్ తరఫున మళ్లీ తొలి మ్యాచ్‌ను ఆడబోతున్నాడు. కరుణ్ చివరిసారిగా భారతదేశం తరపున 2017లో టెస్ట్ ఆడాడు. 2018లో ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత జట్టులోకి ఎంపికైనా.. తుది జట్టులో ఆడే అవకాశం లభించలేదు.
కరుణ్ నాయర్ పునరాగమనం అచ్చం సినిమా కథలాగే అనిపిస్తుంది. డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతమైన ఆటతీరు కనబరచడంతో మళ్లీ జాతీయ జట్టులోకి పిలుపువచ్చింది. 2022లో వరుస వైఫల్యాల తర్వాత సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ‘నాకు మరో అవకాశం ఇవ్వండి’ అంటూ వేడుకున్నాడు. తాజాగా జాతీయ జట్టు నుంచి మళ్లీ పిలుపు అందుకున్నాడు. ఈ సారి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. నాయర్ 2016లో భారతదేశం తరపున అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసినప్పటికీ.. చాలా కాలం పాటు జట్టు తరపున ఆడేందుకు అవకాశం దక్కలేదు. 2022లో కర్ణాటక జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. చాలా సంవత్సరాలుగా దేశీయ క్రికెట్లో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించిన కరుణ్.. ప్రస్తుతం విదర్భ తరఫు ఆడుతున్నాడు.
2024-25 విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ ఎనిమిది ఇన్నింగ్స్‌లలో ఐదు సెంచరీలతో సహా 779 పరుగులు చేశాడు. నాలుగు వరుసగా సెంచరీలు చేసి విదర్భ జట్టును ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు. రంజీ ట్రోఫీలో కూడా అద్భుతంగా రాణించాడు. కేరళతో జరిగిన ఫైనల్లో కీలక సెంచరీ, అర్ధ సెంచరీతో సహా తొమ్మిది మ్యాచుల్లో 863 పరుగులు చేశాడు. విదర్భ టైటిల్ గెలవడంలో ముఖ్య భూమిక పోషించాడు. భారత్ తరఫున కరుణ్ సగటున 62 పరుగులు చేశాడు. భారతదేశం తరపున ఆరు టెస్ట్ మ్యాచ్‌ల్లో 62.33 సగటుతో 374 పరుగులు చేశాడు. ఇందులో ట్రిపుల్ సెంచరీ ఉంది. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో 49.16 సగటుతో 8211 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారతదేశం తరపున ట్రిపుల్ సెంచరీ చేసినప్పటికీ.. చాలాకాలం జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. ఈ సారి మాత్రం విరాట్, రోహిత్ రిటైర్మెంట్తో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని భావిస్తున్నాడు.