తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆటపై చిన్ననాటి నుంచే మక్కువ పెంచుకున్న ఆ కుర్రాడు క్రీజులోకి వచ్చాడంటే ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తాల్సిందే. ఏడేండ్ల వయసు నుంచే క్రికెట్‌పై ఆసక్తి తో ఆటలో ఏండ్ల తరబడి కఠోర శ్రమ, మొక్కవోని దీక్షతో హైదరాబాద్ జట్టుకు అండర్-14 స్థాయి నుంచే ఆడుతున్న ఆ యువ సంచలనం.. అంతర్జాతీయ క్రికెటర్లు పోటీపడే ఐపీఎల్లో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు. రెండ్రోజుల క్రితం అబుదాబిలో ముగిసిన ఐపీఎల్ మినీవేలంలో రాజస్థాన్ రాయల్స్ దక్కించుకున్న కరీంనగర్ కుర్రాడు పేరాల అమన్‌రావు.. భవిష్యత్‌లో భారత క్రికెట్ జట్టుకు ఆడటమే తన లక్ష్యమని అంటున్నాడు.
బీసీసీఐ నిర్వహించే టీ20 టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో హైదరాబాద్ తరఫున ఆడుతూ సంచలన ప్రదర్శనలతో సత్తాచాటిన అమన్‌రావును ఐపీఎల్ మినీ వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 30 లక్షల కనీస ధరతో దక్కించుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న 21 ఏండ్ల అమన్‌రావు.. కరీంనగర్ నుంచి ఐపీఎల్ వరకూ సాగిన తన ప్రయాణంపై నమస్తే తెలంగాణతో పంచుకున్న విశేషాలు..
ఏడేండ్ల వయసులోనే బ్యాట్ పట్టిన అమన్.. అండర్-11, అండర్-14, అండర్-15, అండర్-16, అండర్-19 విభాగాల్లో నిలకడగా ఆడుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం హైదరాబాద్ అండర్-23 జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2018లో బీసీసీఐ నిర్వహించిన విజయ్ మర్చంట్ ట్రోఫీలో హైదరాబాద్ అండర్-16కు ఆడుతూ కేరళపై 238* పరుగులు సాధించడంతో అతడి ప్రతిభ వెలుగులోకి వచ్చింది. అమన్ సత్తా గమనించిన హెచ్‌సీఏ.. 2019లో అండర్-16 జట్టుకు అతడిని సారథిగా నియమించింది.
అదే క్రమంలో బీసీసీఐ నిర్వహించే కూచ్‌బెహార్, వినూ మన్కడ్ ట్రోఫీల్లో హైదరాబాద్ అండర్-19 జట్టుకు ఆడాడు. 2022-23 సీజన్లో హెచ్‌సీఏ అండర్-19 జట్టు (కూచ్‌బెహార్ ట్రోఫీలో)కు ఆడుతూ 3 మ్యాచ్‌ల్లోనే 409 రన్స్ చేశాడు. ఇందులో మూడు శతకాలు ఉండటం గమనార్హం. 2023-24 సీజన్లోనూ అతడి జోరు కొనసాగింది. సీకే నాయుడు ట్రోఫీలో హైదరాబాద్ జట్టు తరఫున ఏకంగా 79 సగటుతో 709 రన్స్ చేసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆ సీజన్లో హైదరాబాద్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇక 2024 స్మాట్‌లో తన అరంగేట్ర మ్యాచ్‌లోనే 67 రన్స్ చేసిన అతడు.. తాజా సీజన్లోనూ మెరుపులు మెరిపించి రాజస్థాన్ ఫ్రాంచైజీ దృష్టిని ఆకర్షించాడు.
ఆరంభం నుంచే వేగంగా ఆడాల్సిన టీ20 ఫార్మాట్ అమన్‌కు సరిగ్గా నప్పుతుంది. మొదటి బంతి నుంచే బౌలర్లపై ఆధిపత్యం చెలాయించే అమన్ కూడా కెరీర్ ఆరంభం నుంచీ ఓపెనర్‌గా రాణిస్తున్నాడు. టీ20ల్లో అతడి స్ట్రైక్ రేట్ 162గా ఉండటం గమనార్హం.
అమన్‌ది ఉమ్మడి కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి. ప్రస్తుతం అతడి కుటుంబం హైదరాబాద్‌లో ఉంటున్నది. నాన్న (పేరాల మధుసూదన్ రావు) కూడా క్రికెటరే. కరీంనగర్ హిందూ క్రికెట్ జట్టు తరఫున ఆయన జిల్లా స్థాయి క్రికెట్ ఆడారు. అమన్ తాత గోపాల్‌రావు గత జడ్పీ పాలకవర్గంలో వైస్‌చైర్మన్‌గా పనిచేశారు. నాన్నే అమన్‌కు స్ఫూర్తి. ఆటపై చిన్నప్పట్నుంచే మక్కువ పెంచుకున్న అమన్ ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు సైతం అతడిని ఆ దిశగా ప్రోత్సహించారు. చిన్నప్పుడు మారేడుపల్లిలోని సెయింట్ జోన్స్‌లో శిక్షణ తీసుకున్న అమన్.. చదువును ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు. ప్రస్తుతం అతడు ఎంబీఏ చేస్తున్నాడు.
అమన్ ఐపీఎల్లో అవకాశం దక్కించుకోవడం మా కుటుంబానికి పండుగ వంటిది. నా కొడుకు ఇన్నాళ్ల కష్టానికి దక్కిన ఫలితం ఇది. 8వ తరగతి నుంచి క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకుని శ్రమిస్తున్నా అమన్ ఏనాడూ చదువులను పక్కన పెట్టలేదు. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ సాగుతున్నాడు.
నాన్న స్ఫూర్తితో చిన్ననాటి నుంచే క్రికెట్‌పై ఇష్టం పెరిగింది. పసిప్రాయం నుంచే నాన్న క్రికెట్ మెళుకువలు నేర్పేవారు. తల్లిదండ్రుల మద్దతుతో ముందుకు సాగుతున్నా. పరిస్థితులకు తగ్గట్టుగా ఆటను మార్చుకోవడం నా బలం. ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. నన్ను నేను నిరూపించుకోవడానికి ఇదొక చక్కని వేదిక. భవిష్యత్‌లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాలన్నది నా లక్ష్యం.