వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్నిఫార్మట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విలియమ్సన్ టెస్ట్ క్రికెట్లో కివీస్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అయితే తాను జట్టులో కొనసాగుతాన్నాడు. ఇకపై వన్డే, టీ20 జట్లకు సారథిగా కొనసాగుతానని స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది పరిమిత ఓవర్ల ప్రపంచకప్, 2024లో టీ20 ప్రపంచ కప్‌లో ఉండటంతో వాటిపై దృష్టి సారించేందుకే టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.
2016లో బ్రెండన్ మెకల్లమ్ తరువాత టెస్ట్ జట్టు కెప్టెన్‌గా విలియమ్సన్ బాధ్యతలు చేపట్టాడు. ఆయన నాయకత్వంలో కివీస్ జట్టు 38 మ్యాచ్‌లు ఆడగా.. 22 టెస్టుల్లో జట్టు విజయం సాధించింది. మరో 8 డ్రా కాగా, 10 మ్యాచుల్లో టీమ్ ఓడిపోయింది. విలియమ్సన్ అన్ని ఫార్మాట్లలో 333 మ్యాచ్‌లు ఆడగా 193 సార్లు న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
కాగా, విలియమ్సన్ అనూహ్య నిర్ణయంతో జట్టు 31వ టెస్ట్ కెప్టెన్‌గా టిమ్ సౌథీని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ టామ్ లాథమ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. సౌథీ నేతృత్వంలో ఈ నెల 26 నుంచి పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ తొలి టెస్ట్ ఆడనుంది.