ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ నేటి నుంచి ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగబోయే రెండో టెస్టులో ఆడాల్సి ఉండగా ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ టెస్టు నుంచి తప్పుకున్నాడు. శుక్రవారం అతడికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
మ్యాచ్ ఆరంభానికి కొన్ని గంటల ముందు స్వల్ప లక్షణాలు కనిపించడంతో అతడికి శుక్రవారం రాపిడ్ యాంటీజెన్ పరీక్ష నిర్వహించారు. ఇందులో విలియమ్సన్కు పాజిటివ్‌గా తేలడంతో అతడు ఐదు రోజులు ఐసోలేషన్లోకి వెళ్లాడు. విలియమ్సన్ లేకపోవడంతో ఓపెనర్ టామ్ లాథమ్ కివీస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
విలియమ్సన్కు కరోనా నిర్దారణ అయిన విషయాన్ని కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ వెల్లడించాడు. కీలక మ్యాచ్‌కు ముందు అతడికి కరోనా సోకడం తమ జట్టుకు పెద్ద షాక్ అని.. అయితే ఈ టెస్టును మిస్ అవుతున్నందుకు కేన్ కూడా తీవ్ర నిరాశకు గురయ్యాడని చెప్పుకొచ్చాడు. విలియమ్సన్ స్థానంలో హమీష్ రూథర్‌ఫర్డ్ తుది జట్టులోకి రానున్నాడు.
ఇంగ్లాండ్ తో లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. మూడు టెస్టుల ఈ సిరీస్ లో ట్రెంట్ బ్రిడ్జి టెస్టు కీలకం. కానీ ఈ మ్యాచ్ కు కేన్ మామతో పాటు కివీస్ ఆల్ రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ కూడా దూరమయ్యారు. లార్డ్స్ టెస్టులో మడమకు గాయం కావడంతో గ్రాండ్‌హోమ్ సిరీస్ మొత్తం నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే సిరీస్ లో 1-0 తో వెనుకబడి ఉన్న కివీస్ కు ఈ ఇద్దరూ దూరమవడం ఇబ్బందికరమే.