Kane Williamson | న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ ఇంగ్లాండ్ దేశీయ లీగ్‌లో ఆడనున్నడు. మిడిల్సెక్స్ క్రికెట్‌తో రెండేళ్ల ఒప్పందంపై సంతకం చేశాడు. టీ20 బ్లాస్ట్, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడనున్నాడు. ఈ సంవత్సరం ది హండ్రెడ్‌లో విలియమ్సన్ లండన్ స్పిరిట్‌కు నాయకత్వం వహించనున్నాడు. గొప్ప బ్యాట్స్మెన్లలో ఒకడిగా పేరున్న విలియమ్సన్ గతంలో గ్లౌసెస్టర్షైర్ (2011-2012), యార్క్‌షైర్ (2013-2018) తరఫున ఆడాడు. మిడిల్సెక్స్ 14 టీ20 బ్లాస్ట్ గ్రూప్ మ్యాచ్‌లలో కనీసం పది, సీజన్ రెండవ భాగంలో కనీసం ఐదు కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచులకు అందుబాటులో ఉంటాడు. విలియమ్సన్ మాట్లాడుతూ తాను గతంలో కౌంటీ క్రికెట్ ఆడానని.. ఇటీవల ఎక్కువగా ఆడలేదని చెప్పాడు. మిడిల్సెక్స్తో ఒప్పందం నిజంగా ఉత్తేజకరమైన అవకాశంగా పేర్కొన్నాడు. విలియమ్సన్ న్యూజిలాండ్ తరపున అన్ని ఫార్మాట్లలో 47 సెంచరీలతో సహా 18వేల పరుగులు చేశాడు. టెస్టుల్లో సగటు 54.88, వన్డేల్లో 49.65 ఉండగా. టీ20ల్లో 33.44గా ఉన్నది. ప్రస్తుతం ఫిబ్రవరి 19న మొదలయ్యే చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు పాక్ చేరిన న్యూజిలాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.