గాలె: శ్రీలంక బ్యాటర్లు శతకాల పండుగ చేసుకోవడంతో న్యూజిలాండ్‌తో గాలె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆ జట్టు భారీ స్కోరు చేసింది. ఆట రెండో రోజు కమిందు మెండిస్ (250 బంతుల్లో182 నాటౌట్, 16 ఫోర్లు, 4 సిక్సర్లు), కుశాల్ మెండిస్ (149 బంతుల్లో 106 నాటౌట్, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాలతో కదం తొక్కగా ఏంజెలో మాథ్యూస్ (88) తృటిలో సెంచరీ కోల్పోయాడు.
ఆట తొలి రోజు చండీమాల్ (116) శతకంతో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆ జట్టు 602/5 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన న్యూజిలాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 14 ఓవర్లలో 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
ఈ టెస్టులో వంద పరుగులు చేయడంతో మెండిస్ పలు రికార్డులు నెలకొల్పాడు. టెస్టులలో అతి తక్కువ (13) ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన వారిలో మెండిస్ నాలుగో స్థానంలో (హెర్బర్ట్ సట్‌క్లిఫ్-12, ఎవర్టన్ వీక్స్-12, డాన్ బ్రాడ్‌మన్-13 ముందున్నారు) నిలిచాడు. మ్యాచ్‌ల పరంగా మెండిస్ -8 (బ్రాడ్‌మన్ 7 మ్యాచ్‌లు) రెండో స్థానంలో ఉన్నాడు. అంతేగాక టెస్టులలో అతడికి ఇది ఐదో శతకం కావడం గమనార్హం. 13 టెస్టు ఇన్నింగ్స్ తర్వాత ఐదు సెంచరీలు చేసిన వారిలో మెండిస్ ఆరో స్థానంలో నిలిచాడు.