Kagiso Rabada | జోహన్నస్బర్గ్: ఐపీఎల్-18లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ ఈ టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన దక్షిణాఫ్రికా పేసర్ కగిసొ రబాడా శనివారం సంచలన ప్రకటనతో క్రికెట్ అభిమానులను షాక్‌కు గురిచేశాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎస్ఏ 20 (సౌతాఫ్రికా క్రికెట్ లీగ్)లో తాను నిషేధిత ఉత్ప్రేరకాన్ని వాడినందుకు గాను దక్షిణాఫ్రికా క్రికెట్ తనపై తాత్కాలిక నిషేధం విధించినట్టు వెల్లడించాడు.
ఎస్ఏ 20లో రబాడా.. ఎంఐ కేప్‌టౌన్‌కు ఆడాడు. ‘వ్యక్తిగత కారణాలతో నేను స్వదేశానికి వెళ్లానని ఇదివరకే తెలిపాను. అయితే ఎస్ఏ 20లో నిషేధిత డ్రగ్‌ను వాడినందుకు గాను దక్షిణాఫ్రికా క్రికెట్ అసోసియేషన్ (ఎస్‌ఏసీఏ) నాపై తాత్కాలిక నిషేధం విధించింది.
క్రికెట్ ఆడే అవకాశాన్ని నేను ఎల్లప్పుడూ గౌరవంగా భావిస్తా. తిరిగి నాకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని అతడు ఓ ప్రకటనలో వెల్లడించాడు. ఇదిలాఉండగా రబాడా వాడిన డ్రగ్ ఏంటి? అతడిపై ఎన్నిరోజులు నిషేధం ఉండనుంది? అన్నదానిపై మాత్రం రబాడా గానీ దక్షిణాఫ్రికా క్రికెట్ గానీ స్పష్టతనివ్వలేదు. సఫారీ పేసర్ తాజా ప్రకటన నేపథ్యంలో అతడు ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్‌లతో పాటు జూన్‌లో జరుగబోయే ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ (ఆస్ట్రేలియా X దక్షిణాఫ్రికా)కూ దూరమవనున్నట్టు సమాచారం.