బ్యాంకాక్: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి రెండో పతకంతో మెరిసింది. ఇప్పటికే మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకం చేజిక్కించుకున్న జ్యోతి.. 200 మీటర్ల పరుగులో రజతం కైవసం చేసుకుంది. ఆదివారం పోటీల చివరి రోజు జ్యోతి 23.13 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. సింగపూర్ రన్నర్ వెరోనికా (22.70) పసిడి పతకం గెలిచింది. ఈ చాంపియన్సిప్లో 27 పతకాలు నెగ్గిన భారత్.. పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. అందులో 6 స్వర్ణాలు, 12 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. 2017లో భువనేశ్వర్ వేదికగా జరిగిన చాంపియన్‌షిప్‌లోనూ భారత్ 27 పతకాలే సాధించింది. చివరి రోజు భారత అథ్లెట్లు 13 పతకాలు నెగ్గారు. మహిళల 3 వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో స్వర్ణం నెగ్గిన పారుల్ చౌదరి.. ఆఖరి రోజు 5000 మీటర్ల పరుగులో రజతం గెలుచుకుంది.