కాన్పూర్: బంగ్లాదేశ్‌తో స్వదేశంలో రెండో టెస్టుకు ఎంపికైన భారత యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, యశ్ దయాల్ ఈ టెస్టు ఆరంభమయ్యాక జట్టును వీడే అవకాశముంది. అక్టోబర్ 1 నుంచి 5 దాకా లక్నో వేదికగా జరగాల్సి ఉన్న ఇరానీ కప్‌లో భాగంగా ఈ ముగ్గురూ ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లకు ఎంపికవడమే ఇందుకు కారణం. బీసీసీఐ మంగళవారం ప్రకటించిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టులో జురెల్, దయాల్ చోటు దక్కించుకోగా సర్ఫరాజ్ ముంబై జట్టులో ఉన్నాడు. ఈనెల 27 నుంచి ఆరంభమయ్యే రెండో టెస్టు తుది జట్టులో గనక ఈ ముగ్గురూ ఆడకుంటే కాన్పూర్ నుంచి నేరుగా లక్నోకు చేరుకుంటారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
రెండో రౌండ్‌కు త్రిసా-గాయత్రి జోడీ
మకావు (చైనా): భారత మూడో సీడ్ బ్యాడ్మింటన్ జోడీ త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రౌండ్ చేరారు. మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో భారత జోడీ.. 15-21, 21-16, 21-14తో అకారీ సాటో, మయ టగుచి (జపాన్) ద్వయాన్ని చిత్తుచేసింది. మరో డబుల్స్ మ్యాచ్‌లో సిక్కీ రెడ్డి, రుత్విక శివానీ.. 21-15, 21-17తో చియుంగ్ యన్ యు (హాంకాంగ్), చు వింగ్ (చైనా) జోడీని ఇంటికి పంపించింది.
‘పంత్ దూకుడుకు కళ్లెం’ : కమిన్స్
ఢిల్లీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ ఏడాది నవంబర్ నుంచి భారత్‌తో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందే ఆస్ట్రేలియా క్రికెటర్లు మైండ్ గేమ్‌కు మరింత పదును పెడుతున్నారు. ఈ మేరకు ఆసీస్ సారథి పాట్ కమిన్స్ ఓ క్రీడా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ప్రతి జట్టులో మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పుకునే ఆటగాళ్లు ఒకరిద్దరు ఉంటారు. పంత్ దూకుడు కూడా ఇలాగే సాగుతుంది. గత రెండు సిరీస్‌లలో అతడు ప్రభావం చూపాడు’ అని అన్నాడు.