Gujarat Titans | అహ్మదాబాద్: ఈ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ (జీటీ).. సొంతగడ్డపై మరో భారీ విజయాన్ని నమోదుచేసింది. శనివారం అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని 7 వికెట్ల తేడాతో ఓడించింది. జోస్ బట్లర్ (54 బంతుల్లో 97 నాటౌట్, 11 ఫోర్లు, 4 సిక్సర్లు), షెర్ఫేన్ రూథర్‌ఫర్ట్ (34 బంతుల్లో 43, 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించడంతో ఢిల్లీ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని టైటాన్స్.. మరో 4 బంతులు మిగిలుండగానే ఊదేసింది. మొదట బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్‌కు బ్యాటర్లు సమిష్టిగా రాణించినా ఒక్కరూ అర్ధ సెంచరీ మార్కును దాటలేకపోయారు. కెప్టెన్ అక్షర్ పటేల్ (32 బంతుల్లో 39, 1 ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా అశుతోశ్ (19 బంతుల్లో 37, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), కరుణ్ నాయర్ (31), స్టబ్స్ (31) రాణించారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ (4/41) నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. బట్లర్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
బట్లర్ బాదగా..
భారీ ఛేదనలో రెండో ఓవర్లోనే టైటాన్స్.. కరుణ్ అద్భుత త్రో తో సారథి శుభ్‌మన్ గిల్ (7) వికెట్‌ను కోల్పోయింది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బట్లర్.. తొలుత సుదర్శన్ (36), తర్వాత రూథర్‌ఫర్డ్‌తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి గుజరాత్‌కు అలవోక విజయాన్ని అందించాడు. స్టార్క్ 3వ ఓవర్లో రెండు చూడముచ్చటైన బౌండరీలు రాబట్టిన సుదర్శన్.. అక్షర్‌కు సిక్సర్‌తో స్వాగతం పలికాడు. ఎదుర్కున్న రెండో బంతినే బౌండరీగా మలిచిన బట్లర్ కూడా విప్రాజ్ నిగమ్ ఐదో ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. కుల్దీప్.. 8వ ఓవర్లో సుదర్శన్‌ను ఔట్ చేయడంతో ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా రూథర్‌ఫర్డ్ క్రీజులోకి వచ్చాడు. ఈ ఇద్దరూ రన్‌రేట్‌ను కాపాడుకుంటూనే క్రీజులో కుదురుకున్నాక బ్యాట్ ఝుళిపించారు. మోహిత్ బౌలింగ్‌లో రూథర్‌ఫర్డ్.. 6, 6తో రెచ్చిపోయాడు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బట్లర్.. స్టార్క్ 15వ ఓవర్లో వరుసగా ఐదు బౌండరీలతో అరుసుకోవడంతో మ్యాచ్‌పై ఢిల్లీ ఆశలు కోల్పోయింది. టైటాన్స్ విజయానికి 8 పరుగుల దూరంలో ఉండగా రూథర్‌ఫర్డ్ నిష్క్రమించినా తెవాటియా (11 నాటౌట్)తో కలిసి బట్లర్ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
సమిష్టిగా రాణించినా..
అంతకుముందు ఢిల్లీ ఇన్నింగ్స్‌లో క్రీజులోకి వచ్చిన బ్యాటర్లంతా మెరుపులు మెరిపించినా ఒక్కరూ భారీ స్కోర్లు చేయలేకపోయారు. ఈ సీజన్లో వరుసగా విఫలమవుతున్న జేక్ ఫ్రేజర్‌ను ఈ మ్యాచ్‌లో పక్కనబెట్టిన ఢిల్లీ.. అభిషేక్ పొరెల్ (18)కు జోడీగా కరుణ్‌ను పంపించింది. సిరాజ్ తొలి ఓవర్లోనే 4, 6, 4తో పొరెల్ దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించినా అర్షద్ ఖాన్ రెండో ఓవర్లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చాడు. మూడో స్థానంలో క్రీజులోకి వచ్చిన రాహుల్ (28).. 4, 6, 4, 4తో ఉన్నంతసేపు ధాటిగానే ఆడాడు. కరుణ్ సైతం రెండు బౌండరీలు, రెండు సిక్సర్లతో జోరు కనబరిచాడు. కానీ ప్రసిద్ధ్.. రాహుల్‌తో పాటు కరుణ్నూ పెవిలియన్‌కు చేర్చాడు. వీరి స్థానాల్లో వచ్చిన అక్షర్, స్టబ్స్ కాస్త నెమ్మదించినా రన్‌రేట్ పడిపోకుండా చూసుకున్నారు. ఆఖర్లో అశుతోశ్ మెరుపులతో ఢిల్లీ 200 రన్స్ మార్కును దాటింది.
సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ: 203/8 (అక్షర్ 39, అశుతోశ్ 37, ప్రసిద్ధ్ 4/41, ఇషాంత్ 1/19);
గుజరాత్: 19.2 ఓవర్లలో 204/3 (బట్లర్ 97*, రూథర్‌ఫర్డ్ 43, కుల్దీప్ 1/30, ముకేశ్ 1/40)