Jos Buttler | కరాచీ: ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి జోస్ బట్లర్ గుడ్‌బై చెప్పాడు. ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో శనివారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్ తన కెప్టెన్సీలో చివరి మ్యాచ్ అంటూ ప్రకటించాడు. మెగాటోర్నీలో టైటిల్ ఫెవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఇంగ్లండ్ వరుస ఓటములతో లీగ్ దశలోనే వెనుదిరిగింది. ఈ నేపథ్యంలో జట్టు ఓటమికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బట్లర్ ప్రకటించాడు.
శుక్రవారం జరిగిన మీడియా భేటీలో బట్లర్ మాట్లాడుతూ ‘ఇంగ్లండ్ కెప్టెన్సీ నుంచి నేను వైదొలుగుతున్నాను. జట్టుతో పాటు నాకు ఇది సరైన సమయమని భావిస్తున్నాను. చాలా క్లియర్‌గా ఉంది. టోర్నీ అనేది ముఖ్యం. వరుసగా రెండు ఓటములతో టోర్నీ నుంచి వైదొలిగాం. గత కొన్ని సిరీస్‌ల నుంచి జట్టు ప్రదర్శన సరిగ్గాలేదు. నా కెప్టెన్సీకి ఇక్కడితో ముగింపు పడింది. ఇది ఒక రకంగా అవమానకరం’ అని అన్నాడు.