ఆధునిక ప్రపంచ క్రికెట్ చరిత్రలో ‘ఫ్యాబ్ 4 క్రికెటర్ల’లో ఒకడిగా వెలుగొందుతున్న ఇంగ్లాండ్ మాజీ సారథి జో రూట్ అరుదైన ఘనతను సాధించాడు. టెస్టు క్రికెట్లో అతడు పది వేల పరుగుల క్లబ్లో చేరాడు. ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య లార్డ్స్ వేదికగా ముగిసిన తొలి టెస్టు లో రూట్ ఈ ఘనత అందుకున్నాడు.
తన కెరీర్లో 118వ టెస్టు ఆడుతున్న రూట్.. ఈ మ్యాచ్ లో సెంచరీ చేయగానే టెస్టులలో పది వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో ఇంగ్లీష్ బ్యాటర్ రూట్. అంతకుముందు అలెస్టర్ కుక్ (161 టెస్టులలో 12,472 పరుగులు) ఈ రికార్డు అందుకున్నాడు. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే టెస్టులలో పది వేల పరుగులు అందుకున్న 14వ బ్యాటర్ రూట్.
ఈ జాబితాలో తొలి 13 స్థానాలలో ఉన్న ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ (15,921), రికీ పాంటింగ్ (13,378), జాక్వస్ కలిస్ (13,289), రాహుల్ ద్రావిడ్ (13,288), అలెస్టర్ కుక్ (12,472), కుమార సంగక్కర (12,400), బ్రియాన్ లారా (11,953), శివనారాయణ్ చందర్ పాల్ (11,867), జయవర్దెనె (11,867), అలెన్ బోర్డర్ (11,174), స్టీవ్ వా (10,927), గవాస్కర్ (10,122), యూనిస్ ఖాన్ (10,099) ఉన్నారు. రూట్ (10,015) పద్నాలుగో స్థానంలో నిలిచాడు.
లార్డ్స్ టెస్టులో సెంచరీ చేయడం ద్వారా స్టీవ్ స్మిత్‌తో సమానంగా నిలిచాడు. రూట్‌కు ఇది 26వ సెంచరీ. ఫ్యాబ్ 4 ఆటగాళ్లుగా పిలిచే విరాట్ కోహ్లి (27), స్టీవ్ స్మిత్ (26), జో రూట్ (26), కేన్ విలియమ్సన్ (24)లు గత కొంతకాలంగా మిగిలినవారికంటే రూట్ మెరుగ్గా ఆడుతున్నాడు.
ఇక లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్.. ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో రూట్ (115 నాటౌట్), బెన్ స్టోక్స్ (54), బెన్ ఫోక్స్ (32 నాటౌట్)లు రాణించారు.