Jhulan Goswami : భారత మహిళల జట్టు మాజీ క్రికెటర్ ఝులాన్ గోస్వామి(Jhulan Goswami)కి అరుదైన గౌరవం లభించింది. ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ(MCC World Cricket Committee)లో సభ్యురాలిగా ఎంపికైంది. ఆమెతో పాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(Eoin Morgan), ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ హీథర్ నైట్(Heather Knight) కూడా ఈ కమిటీలో చోటు దక్కింది. ఈ ముగ్గురిని స్వాగతిస్తూ ఎంసీసీ వరల్డ్ కమిటీ హెడ్ మైక్ గాటింగ్(Mike Gatting) ఒక ప్రకటన విడుదల చేశాడు.
‘వరల్డ్ క్రికెట్ కమిటీకి ఎంపికైన ఝులాన్, ఇయాన్, హీథర్లకు అపూర్వ స్వాగతం పలుకుతున్నా. ఈ ముగ్గురు అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో ఘనతలు సాధించారు. వీళ్ల అనుభవం కమిటీకి ఎంతో ఉపయోగపడనుంది అని మైక్ గాటింగ్ తెలిపాడు. అంతేకాదు మహిళల క్రికెట్‌కు ప్రాధాన్యం పెరుగుతోందని, దాంతో, కమిటీలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంద’ని అతను అభిప్రాయపడ్డాడు.
ఝులాన్ గోస్వామి, హీథర్ నైట్, ఇయాన్ మోర్గాన్
ఈ ఏడాది ఫిబ్రవరిలో క్లారే కొన్నోర్, ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్(Justin Langer), దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మీత్(Graeme Smith) ఈ కమిటీలో చేరారు. మరోవైపు.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్(Alastair Cook) ఈమధ్యే కమిటీ నుంచి తప్పుకున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడడం కోసం అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎంసీసీ కమిటీ అనేది ఒక స్వతంత్ర సంస్థ. ఇందులో మాజీ క్రికెటర్లు, ప్రస్తుతం ఆడుతున్నవాళ్లు, అంపైర్లు, మ్యాచ్ అఫీషియల్స్ సభ్యులుగా ఉంటారు.
భారత మహిళల జట్టకు విశేష సేవలందించిన ఝులాన్ గోస్వామి నిరుడు ఆటకు గుడ్‌బై చెప్పింది. దాదాపు రెండు దశాబ్దాలు ఆడిన ఈ ఫాస్ట్ బౌలర్ వన్డేల్లో 300 వికెట్లు తీసింది. 12 టెస్టుల్లో 44 వికెట్లు పడగొట్టింది. ఝులాన్ జీవిత కథ ఆధారంగా హిందీలో ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్'(Chakda ‘Xpress) అనే సినిమా వచ్చింది. అనుష్కా శర్మ(Anushka Sharma) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. హీథర్ నైట్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ 2016లో మహిళల వరల్డ్ కప్ గెలిచింది. ఇక మోర్గాన్ సారథ్యంలో క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. మోర్గాన్ సేన 2019లో వన్డే వరల్డ్ కప్, 2022లో పొట్టి ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకుంది.