రాజ్‌కోట్: సుదీర్ఘ రంజీ టోర్నీ చరిత్రలో సౌరాష్ట్ర స్టార్ పేసర్ జైదేవ్ ఉనద్కట్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఢిల్లీతో మంగళవారం మొదలైన మ్యాచ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో హ్యాట్రిక్ పడగొట్టి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. వరుస బంతుల్లో ధృవ్ షోరె(0), వైభవ్ రావల్(0), యశ్ ధల్(0) వికెట్లు పడగొట్టిన జైదేవ్ ఈ రికార్డు సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. పదునైన స్వింగ్‌కు తోడు వేగాన్ని జోడించిన జైదేవ్ ధాటికి ఢిల్లీ బ్యాటర్లు వణికిపోయారు.
ఉనద్కట్ నిప్పులు చెరగడంతో ఓ దశలో ఢిల్లీ 10 పరుగులకే ఏడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో షోకిన్(68 నాటౌట్), వశిష్ట్(38) నిలదొక్కుకోవడంతో ఢిల్లీకి గౌరవప్రదమైన స్కోరు దక్కింది. 12 ఓవర్లు వేసి 8 వికెట్లకు 39 పరుగులు ఇచ్చుకున్న ఉనద్కట్ కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకు న్నాడు. ఉనద్కట్ ధాటికి ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత హార్విక్ దేశాయ్(104 నాటౌట్) సెంచరీతో సౌరాష్ట్ర 184/1 స్కోరు చేసింది.