Jai Shah | దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన అధ్యక్షుడిగా జై షా ఆదివారం (డిసెంబర్ 1న) బాధ్యతలు స్వీకరించారు. గ్రెగ్ బార్క్లే స్థానాన్ని భర్తీ చేసిన 36 ఏండ్ల షా.. ఈ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కారు. రెండేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగే ఆయన భారత్ నుంచి ఈ ఘనత సాధించిన ఐదో భారతీయుడిగా నిలిచారు. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్. శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఈ బాధ్యతల్లో పనిచేశారు. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ఐసీసీ అధ్యక్ష ఎన్నికలలో షా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.
ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జై షా స్పందిస్తూ.. ఈ పదవిని చేపట్టడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఆమోదించిన డైరెక్టర్లు, ఇతర దేశాల బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 2028లో జరుగబోయే లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడమే తన ముందున్న ప్రధాన కర్తవ్యమని జై షా వెల్లడించారు. కాగా అధ్యక్షుడిగా షా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో త్వరలోనే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (పాకిస్థాన్, హైబ్రిడ్ మోడల్) షెడ్యూల్‌పై ప్రకటన వెలువడే అవకాశముంది.