హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ సీనియర్ వాలీబాల్ టోర్నీలో పోటీపడుతున్న తెలంగాణ జట్టుకు రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం కాసింబౌలికి చెందిన జశ్వంత్‌రెడ్డి ఎంపికయ్యాడు. ఈనెల 4 నుంచి 10వ తేదీ వరకు వారాణాసిలో జరుగుతున్న టోర్నీలో తెలంగాణ జట్టు తరఫున జశ్వంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం రాష్ట్ర క్రీడాధికార సంస్థ (సాట్స్)లో శిక్షణ పొందుతున్న ఈ యువ ప్లేయర్.. కేఐఐటీ తరఫున యూనివర్సిటీ స్థాయి వాలీబాల్ పోటీల్లో ఆడుతున్నాడు.
వచ్చే నెలలో రాజస్థాన్‌లో జరుగనున్న ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్‌లో కూడా సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన జశ్వంత్‌రెడ్డి ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నీలో పతకాలతో ఆకట్టుకున్నాడు. ఓవైపు కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగుతున్నాడు. రానున్న టోర్నీల్లోనూ తన ప్రతిభతో పతకాలు సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.