Jasmine Paolini | లండన్: కొద్దిరోజుల క్రితమే ముగిసిన ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలన ఆటతీరుతో ఫైనల్ చేరిన ఇటలీ అమ్మాయి జాస్మిన్ పలోని వింబుల్డన్‌లోనూ సత్తాచాటింది. గురువారం సెంటర్ కోర్టు వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీస్‌లో ఏడో సీడ్ పలోని 2-6, 6-4, 7-6 (10/8)తో డొనా వెకిచ్ (క్రొయేషియా)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి వింబుల్డన్ ఫైనల్ చేరింది. తద్వారా ఈ టోర్నీ మహిళల సింగిల్స్ చరిత్రలో ఇటలీ నుంచి ఫైనల్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళ క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.
2 గంటల 51 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో పలోని తొలి సెట్లో ఓడినా తర్వాత పుంజుకుని రెండో సెట్‌ను గెలుచుకుని పోటీలోకి వచ్చింది. కీలకమైన మూడో సెట్లో టైబ్రేక్ ద్వారా ఫలితం తేలినా చివరి దాకా పట్టుదలగా ఆడి టైటిల్ పోరుకు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడినా వెకిచ్ పోరాటం ఆకట్టుకుంది. క్రెజికోవ, రిబాకినా మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో పలోని ఫైనల్ ఆడనుంది. పురుషుల సెమీస్‌లో భాగంగా శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అల్కారజ్, ఐదో సీడ్ మెద్వెదెవ్‌తో తాడోపేడో తేల్చుకోనున్నాడు. రెండో సెమీస్ ముసెట్టి, జొకోవిచ్ మధ్య జరుగనుంది.