ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన ఒసాక

- ఫైనల్లో బ్రాడీపై ఘనవిజయం
- నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కైవసం
- నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్
గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గడాన్ని అలవాటుగా మార్చుకున్న జపాన్ స్టార్ ప్లేయర్ నవోమి ఒసాక మరో టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఒక్క సెట్ మాత్రమే కోల్పోయి ఫైనల్ చేరిన ఒసాక.. తుదిపోరులో జెన్నిఫర్ బ్రాడీని చిత్తుచేసింది. ఇప్పటికే మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఒసాక జోరు ముందు తొలిసారి మెగా ఫైనల్ చేరిన బ్రాడీ నిలువలేకపోయింది. గంటకు రెండొందల కిలోమీటర్ల వేగంతో ఒసాక విసిరిన సర్వీసులకు బదులు చెప్పలేక చేతులెత్తేసింది. మహిళల పోరులో ఊహించిన ఫలితమే రాగా.. పురుషుల సింగిల్స్ ఫైనల్లో జొకోవిచ్, మెద్వెదెవ్ తలపడనున్నారు. మరి అనుభవానిదే పైచేయి అవుతుందా.. లేక యువ ఆటగాడు సంచలనం సృష్టిస్తాడా నేడు తేలనుంది.
మెల్బోర్న్: భారీ అంచనాల మధ్య ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ బరిలోకి దిగిన జపాన్ స్టార్ నవోమి ఒసాక దుమ్మురేపింది. అదిరిపోయే ఆటతో నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. గత ఎనిమిది గ్రాండ్‌స్లామ్‌ల్లో ఒసాక నాలుగింట విజేతగా నిలువడం విశేషం. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఒసాక 6-4, 6-3తో జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా)ని చిత్తు చేసి రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్రోఫీ చేజిక్కించుకుంది. గంటా 17 నిమిషాల్లో ముగిసిన పోరాటంలో ఒసాక ఆరు ఏస్‌లు సంధిస్తే.. బ్రాడీ రెండింటికే పరిమితమైంది. ఒసాక రెండు డబుల్ ఫాల్ట్స్ చేస్తే.. అమెరికా అమ్మాయి 4 డబుల్ ఫాల్ట్స్‌తో మూల్యం చెల్లించుకుంది. విన్నర్స్ విషయంలో ఒసాక (16), బ్రాడీ (15) దాదాపు సమంగా నిలిచినా.. అనవసర తప్పిదాలు ఎక్కువ చేసిన బ్రాడీ పరాజయంతో వెనుదిరిగింది.
అభిమానుల ప్రోత్సాహంతో..
తొలి సెట్ నుంచే పూర్తి ఆధిపత్యం కనబర్చిన ఓసాక ఒక దశలో ప్రేక్షకుల వైపు మళ్లి వారిని మరింత సందడి చేయాల్సిందిగా కోరింది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న కారణంగా గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ప్రేక్షకులను అనుమతించని నిర్వాహకులు మహిళల సింగిల్స్ ఫైనల్‌కు 7,500 మంది అభిమానులను స్టేడియంలోకి అనుమతించారు. పెద్దగా హడావుడీ లేకుండానే పని పూర్తి చేసుకెళ్లే ఒసాక.. ఈ సారి కాస్త భిన్నంగా కనిపించింది. కోర్టులో బిగ్గరగా అరుస్తూ.. అభిమానుల్లో జోష్ నింపింది. మరోవైపు టాప్-10లో ఒక్క ప్లేయర్‌తో కూడా తలపడకుండానే ఫైనల్ చేరిన 25 ఏండ్ల బ్రాడీ.. తుదిపోరులో ఒసాక ముందు నిలువలేకపోయింది. సెమీఫైనల్లో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్‌పై విజయం సాధించిన అనంతరం ‘జనాలు ఎప్పుడూ విజేతలనే గుర్తుపెట్టుకుంటారు. రెండో స్థానంలో నిలిచిన వారి పేర్లు వారికి అక్కర్లేదు’అని తన మనసులో మాట బయటపెట్టిన ఒసాక అందుకు తగ్గట్లే రెచ్చిపోయింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండాటైటిల్ చేజిక్కించుకుంది.
ఒసాక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్
2019, 2021
ఆస్ట్రేలియన్ ఓపెన్
2018, 2020
యూఎస్ ఓపెన్
నా గత గ్రాండ్‌స్లామ్ టోర్నీని అభిమానుల మధ్య ఆడలేకపోయా. ప్రేక్షకుల మద్దతు మధ్య మైదానంలో పోరాడటాన్ని ఆస్వాదిస్తా. ఈ విజయం సంతృప్తినిచ్చింది. ఇదే జోరు మట్టి కోర్టులోనూ కొనసాగించాలనుకుంటున్నా -నవోమి ఒసాక
ప్రస్తుతం కొనసాగుతున్న ప్లేయర్లలో సెరెనా విలియమ్స్ (23), వీనస్ విలియమ్స్ (7) మాత్రమే ఒసాక (4) కంటే ఎక్కువ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గారు.
జొకోవిచ్ x మెద్వెదెవ్
నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్
కొవిడ్-19 ప్రభావంతో ఆలస్యంగా ప్రారంభమైన సీజన్ ఆరంభ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ ఫైనల్‌కు వేళైంది. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్. నాలుగో ర్యాంకర్ మెద్వెదెవ్‌తో తలపడనున్నాడు. ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకున్న జొకో.. తొమ్మిదోసారి టైటిల్ పట్టాలని ఆరాటపడుతుంటే..గత 20 మ్యాచ్‌లుగా ఓటమి ఎరుగకుండా దూసుకెళ్తున్న మెద్వెదెవ్ తొలిసారి గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని ముద్దాడాలని తహతహలాడుతున్నాడు. ఇప్పటి వరకు 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన జొకో జోరు ముందు మెద్వెదెవ్ నిలువగలడా లేదా చూడాలి. యూఎస్ ఓపెన్‌లో తుదిమెట్టుపై బోల్తాపడ్డ మెద్వెదెవ్ ఈసారి ఎలాగైనా తన గ్రాండ్‌స్లామ్ కల నెరవేర్చుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. ‘జొకోను ఓడించాలంటే అత్యుత్తమ ఆటతీరు కనబర్చాలి. ఐదు గంటల పాటు శారీరకంగా, మానసికంగా మైదానంలో చురుగ్గా ఉండగలిగితేనే అది సాధ్యపడుతుంది. జొకోపై గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేజిక్కించుకుంటే వచ్చే మజానే వేరు’అని మెద్వెదెవ్ అన్నాడు. సెమీస్, ఫైనల్స్ కలుపుకొని 17 మ్యాచ్‌ల్లో జొకోకు ఓటమన్నదే లేకపోవడం విశేషం.
లైవ్
మధ్యాహ్నం 2.00 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో
ప్రైజ్‌మనీ
విజేత: రూ.15.70 కోట్లు
రన్నరప్: రూ.8.56 కోట్లు
తాజావార్తలు
- సెల్లార్లతో పాటు భవనాన్ని సీజ్ చెయ్యండి
- సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. మంత్రి తలసాని
- సంస్థాగత బలోపేతమే లక్ష్యం
- భక్తుల విశ్వాసానికి ప్రతీక
- పార్కు ఆధునీకరణకు ప్రణాళిక
- డిగ్రీ విద్యార్థికి ఎమ్మెల్సీ ఆర్థిక సహాయం
- పల్లె ప్రగతికి కృషి చేయాలి
- సభ్యత్వ నమోదుకు స్పందన
- 1.26 లక్షల ఉద్యోగాలు భర్తీ
- శ్రీనివాస్‌గౌడ్‌కు సీఎం పరామర్శ