కుమామోటో(జపాన్) : భారత యువ షట్లర్లు మరో కీలక పోరుకు సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి మొదలుకానున్న కుమామోటో జపాన్ సూపర్-500 టోర్నీలో హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ బరిలోకి దిగనున్నారు. స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఫామ్ ఒడిదుడుకుల పయనంగా సాగుతున్నది. ఈ మధ్యే ముగిసిన హాంకాంగ్ ఓపెన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న లక్ష్యసేన్..డెన్మార్క్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లోనే తన పోరాటాన్ని ముగించాడు. జపాన్ ఓపెన్ ద్వారా తిరిగి గాడిలో పడేందు ప్రయత్నిస్తున్న సేన్ ఏడో సీడ్‌గా పోటీపడుతున్నాడు.
అయితే జపాన్‌కు చెందిన వరల్డ్ 25వ ర్యాంకర్ కొకి వటనబె రూపంలో సేన్‌కు కఠినమైన ప్రత్యర్థి ఎదురుకానున్నాడు. మరోవైపు గాయం నుంచి తేరుకున్న ప్రణయ్ సత్తాచాటేందుకు పట్టుదలతో ఉన్నాడు. గత నెలలో జరిగిన కొరియా ఓపెన్‌లో అస్వస్థతతో మ్యాచ్ మధ్యలోనే వైదొలిగిన ప్రణయ్‌కు జున్ హవో లియాంగ్‌తో తొలి మ్యాచ్‌లో తలపడనున్నాడు. వీరికి తోడు ఆయూశ్ శెట్టి, తరుణ్ మన్నెపల్లి, కిరణ్‌జార్జ్, రోహన్ కపూర్, రిత్వికా శివానీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.