ఖతార్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఫిపా ప్రపంచకప్‌లో సంచలనాల పర్వం కొనసాగుతున్నది. మెగాటోర్నీలో ఇప్పటికే సౌదీఅరేబియా.. అర్జెంటీనాకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వగా, తాజాగా నాలుగుసార్లు చాంపియన్ జర్మనీకి జపాన్ ఝలక్ ఇచ్చింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన జర్మనీ.. జపాన్ అసమాన పోరాటం ముందు తలొగ్గింది. మ్యాచ్‌లో జర్మనీదే ఆధిపత్యమైనా.. కీలకమైన ద్వితీయార్థంలో జూలు విదిల్చిన జపాన్ వరుస గోల్స్‌తో సంచలన విజయం సాధించింది. తకుమా అసానో, రిత్సు డోవాన్ సూపర్ గోల్స్‌తో జపాన్ గెలుపు సంబురాల్లో మునిగిపోయింది. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్..ఆస్ట్రేలియా విజయదుందుభి మోగించగా, కోస్టారికాపై స్పెయిన్ ఘన విజయంతో బోణీ కొట్టింది.
దోహా: ఫిఫా ప్రపంచకప్‌లో పసికూనలు అనుకున్న జట్లు పంజా విసురుతున్నాయి. మెగాటోర్నీలో మేటి జట్లు అన్నదగ్గ వాటిని మట్టికరిపించి చిర్మసరణీయ విజయాలు సొంతం చేసుకుంటున్నాయి. ర్యాంకింగ్స్ పరంగా తమకంటే మెరుగైన జట్లకు ఝలక్ ఇస్తున్నాయి. సౌదీఅరేబియాను స్ఫూర్తిగా తీసుకుంటూ ఆసియాకే చెందిన జపాన్..జర్మనీకి ఝలక్ ఇచ్చింది. బుధవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన గ్రూపు-ఈ మ్యాచ్‌లో జపాన్ 2-1తో జర్మనీపై చిరస్మరణీయ విజయం సాధించింది.
జపాన్ తరఫున రిత్సు డోవాన్(75ని), తకుమా అసానో (83ని) గోల్స్ చేయగా, ఇకే గునెడోగాన్ (33ని) జర్మనీకి ఏకైక గోల్ అందించాడు. మ్యాచ్ విషయానికొస్తే జర్మనీదే ఆధిపత్యమైనా..ఆఖరికి జపాన్ను విజయం వరిచింది. మ్యాచ్‌లో బంతిని 65శాతం జర్మనీ తమ ఆధీనంలో ఉంచుకుంటే జపాన్ 24 శాతానికి పరిమితమైంది. ఆది నుంచి జర్మనీ తమ ఆధిపత్యం కొనసాగించేందుకు ప్రయత్నించింది. అయితే జపాన్ కూడా అంతే దీటుగా బదులిచ్చింది. ర్యాంకింగ్స్ పరంగా తమ(11) కంటే 13 ర్యాంక్‌లు వెనుకఉన్న జపాన్(24)ను కార్నర్ చేసేందుకు జర్మనీ అన్ని రకాలుగా ప్రయత్నించింది. మ్యాచ్ 33వ నిమిషంలో జపాన్ గోల్‌కీపర్ షుచి గోండా దురుసుగా అడ్డుకోవడంతో దక్కిన పెనాల్టీని గునెడోగాన్ అలవోకగా గోల్‌గా మలిచాడు. దీంతో ప్రథమార్ధాన్ని జర్మనీ 1-0తో ముగించింది. కీలకమైన ద్వితీయార్ధంలో మరింత దూకుడు పెంచేందుకు ప్రయత్నించిన జర్మనీకి జపాన్ నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది.
ముఖ్యంగా జపాన్ గోల్‌కీపర్ గోండా జర్మనీ స్ట్రైకర్ల దాడులను సమర్థంగా తిప్పికొట్టాడు. జర్మనీ 25సార్లు జపాన్ గోల్‌పోస్ట్‌పై దాడి చేస్తే..జపాన్ 11సార్లు ప్రయత్నించి రెండు సార్లు సఫలమైంది. మ్యాచ్ 75వ నిమిషంలో జర్మనీ గోల్‌కీపర్ మాన్యుయల్ న్యూయర్ చేసిన తప్పును డోవాన్ చాకచక్యంగా గోల్‌గా మలచడంతో స్కోరు 1-1తో సమమైంది. ఇదే జోరులో ఎనిమిది నిమిషాల తేడాతో అసానో క్లిష్టమైన కోణంలో చేసిన గోల్‌తో జపాన్ గెలుపు సంబురాల్లో మునిగిపోయింది. ఓవైపు స్టేడియంలో జపనీయుల సంబురాలు ఆకాశానికి అంటితే.. జర్మనీకి నిర్వేదమే మిగిలింది.
ఫ్రాన్స్, స్పెయిన్ బోణీ
మెగాటోర్నీలో ఫ్రాన్స్, స్పెయిన్ అదిరిపోయే బోణీ కొట్టాయి. ఫ్రాన్ 4-1తో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. అడ్రియన్ రాబిట్(27ని), ఒలీవర్ గిరౌడ్(32ని, 71ని), ఎంబాపె(68ని) ఫ్రాన్స్‌కు గోల్స్ అందించగా, గుడ్విన్(9ని) ఆసీస్ తరఫున ఏకైక గోల్ చేశాడు. స్పెయిన్ 7-0తో కోస్టారికాపై భారీ విజయం సాధించగా, మొరాకో, క్రొయేషియా మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది.