హైదరాబాద్, ఆట ప్రతినిధి: పుష్కరకాలంగా నిలిచిపోయిన జోనల్ క్రికెట్‌ను పునరుద్ధరించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నూతన కార్యవర్గం సిద్ధమైందని అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు అన్నారు. శనివారం జింఖానా మైదానంలో పురుషుల సీనియర్ జోనల్ టోర్నీలో సికింద్రాబాద్ ఎలెవన్, సెక్రెటరీ ఎలెవన్ జట్ల మధ్య మ్యాచ్‌ను టాస్ వేసి ప్రారంభించారు. అంతకుముందు ఇరు జట్ల ప్లేయర్లను జగన్ పరిచయం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఏడాది పొడవునా క్రికెటర్లు ఖాళీ లేకుండా టోర్నీలు నిర్వహిస్తాం. త్వరలో జూనియర్ స్థాయిలోనూ జోనల్ టోర్నీలు ఏర్పాటు చేస్తాం. ఏడాదికి ఆరు వేల మ్యాచ్‌ల నిర్వహణకు కసరత్తు చేస్తున్నాం. ఇందుకోసం కొత్త మైదానాలను సిద్ధం చేస్తున్నాం. హెచ్‌సీఏను హైదరాబాద్ వరకే పరిమితం చేయకుండా..మిగతా జిల్లాల్లోనూ క్రికెట్‌ను అభివృద్ధి చేస్తాం. అన్ని జట్లలో 50శాతానికి పైగా గ్రామీణ క్రికెటర్లకు అవకాశం దక్కేలా చూస్తాం. మాజీ క్రికెటర్ల సలహాలు, సూచనలతో హెచ్‌సీఏకు పునర్ వైభవం తీసుకొస్తాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఈవో సునీల్, ఎక్సలెన్సీ డైరెక్టర్ విజయ మోహన్, వివేక్ జయసింహా, క్యురేటర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.