హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : ఫోర్జరీ పత్రాల కేసులో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్రావు మరో నలుగురు ఆఫీస్ బేరర్లను అరెస్ట్ చేసినట్లు సీఐడీ డీజీ చారుసిన్హా గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) జనరల్ సెక్రటరీ ధరమ్ గురువారెడ్డి ఫిర్యాదు ఆధారంగా బుధవారం కేసు నమోదు చేశామన్నారు. ఐపీసీ 465, 468, 471, 403, 409, 420 ఆర్/డబ్ల్యూ 34 వంటి సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ కేసులో జగన్మోహనరావుతో పాటు హెచ్సీఏ కోశాధికారి జేఎస్ శ్రీనివాసరావు, హెచ్సీఏ సీఈఓ సునీల్ కాంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు జి.కవిత ఉన్నారు. సీఐడీ అధికారులు సేకరించిన ఆధారాలు, దర్యాప్తు ఆధారంగా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్రావు నకిలీ పత్రాలను సృష్టించారని తెలిపారు.
గౌలిపుర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సి.కృష్ణయాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేసి ఆ పత్రాలను జగన్మోహన్రావుకు అందించారు. దీంతో ఆ పత్రాలను ఉయోగించి ఆయన హెచ్సీఏ ప్రెసిడెంట్ అయ్యారని సీఐడీ డీజీ తెలిపారు. ఆ తర్వాత జగన్మోహన్రావు, జేఎస్ శ్రీనివాసరావు, సునీల్ కాంటే ఇతర నిందితులతో కలిసి కుట్రపూరిత ఉద్దేశంతో ప్రజా నిధులను దుర్వినియోగం చేయడంతోపాటు, ఐపీఎల్, ఎస్ఆర్ హెచ్ అధికారులను నిర్బంధించడంతో సహా.. బెదిరింపులు, కార్పొరేట్ బాక్సుల యాక్సెస్, కాంప్లిమెంటరీ టిక్కెట్ల కోసం బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని సీఐడీ డీజీ చారుసిన్హా తెలిపారు. కేసు విచారణలో ఉన్నదని, త్వరలో మరిన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. కాగా, నిందితులకు గురువారం మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి మల్కాజిగిరి కోర్టుకు తరలించారు. విచారణ అనంతరం కోర్టు.. జగన్మోహన్రావుకు 12 రోజుల రిమాండ్ విధించింది.