IRL | చెన్నై: భారత్‌లో రేసింగ్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) శనివారం చెన్నైలో అట్టహాసంగా మొదలైంది. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్లో భాగంగా శనివారం జరిగిన ఐఆర్ఎల్, ఫార్ములా-4 ఇండియన్ చాంపియన్‌షిప్ ఆరంభ రేసుల్లో చెన్నై టర్బో రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జోన్ లాంకాస్టర్, బెంగళూరు స్పీడ్‌స్టర్స్ డ్రైవర్ జాడెన్ పరియాట్ విజేతలుగా నిలిచారు.
ఎ-లెవల్ డ్రైవర్ల కోసం నిర్వహించిన రేసులో లాంకాస్టర్ రేసును 27 నిమిషాల 15.812 సెకన్లలో పూర్తిచేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక ఎఫ్-4 ఇండియన్ చాంపియన్‌షిప్ రేసును 21 నిమిషాల 14.967 సెకన్లలో పూర్తిచేసిన జాడెన్ అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు.
బెంగళూరు యువ డ్రైవర్, ఈ లీగ్‌లో శ్రాచి రాయల్ బెంగాల్ టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రుహాన్ అల్వా ఐఆర్ఎల్, ఎఫ్4 ఇండియా చాంపియన్‌షిప్‌లలోనూ మూడో స్థానంలో నిలిచాడు. కాగా ఈ లీగ్‌లో భారీ ఆశలతో బరిలోకి దిగిన హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ రెండు రేసుల్లోనూ నిరాశపరిచింది.