నింగ్బొ (చైనా): ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్‌నకు వేళైంది. చైనాలోని నింగ్బొ వేదికగా ఆరు రోజుల పాటు సాగే ఈ టోర్నీలో భారత్ స్టార్ షట్లర్లతో బరిలో నిలిచింది. సాత్విక్-చిరాగ్ ద్వయం తప్పుకున్న నేపథ్యంలో భారత బృందాన్ని పీవీ సింధు, లక్ష్యసేన్ నడిపించనున్నారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌తో పాటు ప్రణయ్, రజావత్, కిరణ్ జార్జి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
సేన్ తన తొలి మ్యాచ్‌లోనే కఠిన ప్రత్యర్థి లీ చియా హోతో తలపడనున్నాడు. ఒకవేళ అతడు క్వార్టర్స్ చేరితే అక్కడ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ షి యు కితో ఆడాల్సి ఉంటుంది. మహిళల సింగిల్స్‌లో సింధు, బన్సోద్, అనుపమ, ఆకర్షి బరిలో నిలిచారు. సింధు తొలి రౌండ్లో తన కంటే తక్కువ ర్యాంకు కలిగిన ఎస్తర్ నురుమితో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే ఆమె రెండో రౌండ్లో జపాన్ అమ్మాయి యమాగుచిని ఢీకొననుంది. డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లోనూ భారత్ నుంచి పలువురు షట్లర్లు బరిలో ఉన్నారు.