ఫైనల్ అంటే ఫైనలే. వార్ మధ్యలో ముగిసేది కాదు. చివరి వరకు చమటలు చిందించాల్సిందే. గెలుపు కోసం కసి తీరా పోరాడాల్సిందే. ఆదివారం రాత్రి ఖతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్.. ఫుట్‌బాల్ చరిత్రలో నిలిచిపోనున్నది. బహుశా ఇలాంటి ఫైనల్ మ్యాచ్ గతంలో ఎప్పుడూ జరగలేదనుకుంటా. ఇక భవిష్యత్తులోనూ ఇలాంటి ఉత్కంఠభరిత ఫైనల్ ఉండదేమో అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సాకర్ అభిమానులకు ఆ ఫైనల్ కన్నులపండుగే మిగిల్చింది. కిక్కిరిసిన స్టేడియంలో ఇంత ఎంటర్టైన్మెంట్ ఉండదేమో. మళ్లీ ఇలాంటి మజా దొరుకుడు కష్టమే.
ఆట 80వ నిమిషం వరకు అర్జెంటీనాదే పైచేయి. మెస్సి బృందం ఫస్ట్ హాఫ్‌లో ఆకట్టుకున్నది. రెండు గోల్స్‌తో ఆధిపత్యాన్ని చాటింది. కానీ సెకండ్ హాఫ్‌లో మ్యాచ్ సడెన్‌గా యూటర్న్ తీసుకున్నది. రెండు నిమిషాల్లో సీన్ మొత్తాన్నే మార్చేసింది ఫ్రాన్స్. ఎంబాపే వరుసగా రెండు గోల్స్ చేసి ఫ్రాన్స్ అభిమానులకు ఆక్సిజన్ అందించాడు. ఇక లుసైల్ స్టేడియం హోరెత్తింది. అప్పటి వరకు మౌనంగా ఉన్న ఫ్రాన్స్ మద్దతుదారులు.. అరుపులు, కేకలతో చిందేశారు. అధ్యక్షుడు మాక్రన్ కూడా కూర్చులోంచి లేచి మరీ ఆ థ్రిల్‌ను ఆస్వాదించారు.
నిజానికి తొలి అర్థభాగంలో ఫ్రాన్స్ ఎందుకు వెనుకబడిందో అర్థంకాలేదు. డిఫెండింగ్, అటాకింగ్ ప్లేయర్లు ఉన్న ఫ్రాన్స్ జీవం లేనట్లుగా ఆడింది. మెస్సి ఇచ్చిన ఫస్ట్ స్ట్రోక్‌తో ఫ్రాన్స్ కుదేలైంది. విశ్లేషకులు అర్జెంటీనా ఈజీగా గెలిచేస్తుందని డిసైడ్ అయ్యారు. కానీ ఎంబాపే తన గోల్స్‌తో మ్యాచ్‌ను ఎక్స్ట్రా టైమ్‌లోకి లాక్కెళ్లాడు. 35 ఏళ్ల మెస్సి.. 23 ఏళ్ల ఎంబాపేల మీదే ఫైనల్ మ్యాచ్ మొత్తం సాగింది. ఆ ఇద్దరి ట్యాలెంట్ ఫుట్‌బాల్ అభిమానుల్ని ఆకట్టుకున్నది. ఎక్స్ట్రా టైమ్ ఫస్ట్ హాఫ్‌లో మెస్సి గోల్ చేసి.. మ్యాచ్‌ను అర్జెంటీనా వైపు తిప్పేసుకున్నాడు. ఇక ఎక్స్ట్రా టైమ్ సెకండ్ హాఫ్‌లో ఎంబాపే గోల్ మళ్లీ మ్యాచ్‌లో ఉత్కంఠ రేపింది. ఆ గోల్‌తో నరాలు తెగే టెన్షన్ పుట్టించాడు ఎంబాపే. 3-3 గోల్స్ తో రెండు జట్లు చివరకు షూటౌట్‌కు వెళ్లాయి.
ఈ ఫైనల్లో మరో హీరో గోల్ కీపర్ మార్టినేజ్. అర్జెంటీనా విజయంలో మార్టినేజ్ కీలక పాత్ర పోషించాడు. ఫ్రాన్స్ కొట్టిన రెండవ గోల్‌ను సేవ్ చేశాడతను. ఆ తర్వాత తన మైండ్‌గేమ్‌తో మరో ఫ్రాన్స్ ప్లేయర్‌ను బోల్తా కొట్టించాడు. చాలా చాకచక్యంగా గోల్ కీపింగ్ చేశాడు మార్టినేజ్. నిజానికి ఎక్స్ట్రా టైమ్ సెకండ్ హాఫ్‌లో ఓ దశలో అద్భుతమైన రీతిలో గోల్‌ను సేవ్ చేశాడతను. ప్రతి దశలోనూ క్లైమాక్స్ ట్విస్ట్‌లా మారిన ఫైనల్లో చివరకు 4-2 గోల్స్ తేడాతో అర్జెంటీనా గెలిచింది. కానీ సాకర్ ప్రియుల్ని ఉక్కిరిబిక్కిరి చేసిన ఘనత మాత్రం ఇద్దరు స్టార్లకు దక్కుతుంది. మెస్సి, ఎంబాపేలు సూపర్ హీరో పాత్రలు పోషించారు. ఫుట్‌బాల్ మాజీ దిగ్గజాలు కూడా ఫైనల్‌ను తెగ ఆస్వాదించారు. ఇలాంటి ఫైనల్ మళ్లీ చూడలేమన్నారు.
అర్జెంటీనా జట్టు నుంచి రిటైర్ కావడం లేదని మ్యాచ్ ముగిశాక మెస్సి తెలిపాడు. గోల్డెన్ బాల్(బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్) అవార్డు మెస్సి గెలుచుకున్నాడు. ఇక అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి ఇచ్చే గోల్డెన్ బూట్ అవార్డును ఎంబాపే కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో ఎంబాపే 8 గోల్స్ చేశాడు. అర్జెంటీనాకు చెందిన యువ ఆటగాడు ఎంజో ఫెర్నాండేజ్ ఫిఫా యంగ్ ప్లేయర్ అవార్డు గెలిచాడు.