లండన్: వింబుల్డన్‌లో ఇటలీ యువ సంచలనం యానిక్ సిన్నర్ మూడో రౌండ్‌కు ప్రవేశించాడు. గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ సిన్నర్.. 6-1, 6-1, 6-3తో అలగ్జాండర్ వుకిక్ (ఆస్ట్రేలియా)ను వరుస సెట్లలో మట్టికరిపించాడు. ఐదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (యూఎస్).. 6-4, 6-3, 6-7 (5/7), 6-1తో డేవిడోవిచ్ ఫోకిక (స్పెయిన్)ను చిత్తుచేసి మూడో రౌండ్‌కు ప్రవేశించాడు. 14వ సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా).. 7-5, 6-2, 6-3తో అడ్రియన్ (ఫ్రాన్స్)ను ఓడించి మూడో రౌండ్‌కు ప్రవేశించాడు.
మహిళల సింగిల్స్‌లో సంచలనాల పర్వం కొనసాగుతున్నది. కోకో గాఫ్, జెస్సిక పెగులా, ఇటలీ అమ్మాయి జాస్మిన్ పౌలోని బాటలో ఆరో సీడ్ మాడిసన్ కీస్ (యూఎస్) కూడా రెండో రౌండ్‌కే ఇంటిబాట పట్టింది. మహిళల సింగిల్స్ పోరులో కీస్.. 3-6, 3-6తో లారా సిగ్మండ్ (జర్మనీ) చేతిలో ఓడింది. జపాన్ బామ నవోమి ఒసాకాకు.. 6-3, 6-4, 6-4తో పవ్లుచెంకోవ (రష్యా) షాకిచ్చింది.