టెస్టు కెప్టెన్సీ నుంచి అనూహ్యంగా తప్పుకున్న విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచానికి షాకిచ్చాడు. ఈ క్రమంలో చాలా మంది దీనిపై స్పందించారు. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ దీనిపై మాట్లాడాడు. కోహ్లీ నిర్ణయంతో తను సర్ప్రైజ్ అయిన మాట వాస్తవమే అని చెప్పిన వార్న్.. కానీ ఇది కోహ్లీ ఒక అద్భుతమైన అవకాశం కూడా అని అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్ తానే అని నిరూపించుకోవడానికి కోహ్లీకి ఇది మంచి అవకాశం అని వార్న్ అన్నాడు. అయితే ఇది అంత సులభం కాదని, కానీ అందరికీ తన విలువ చూపించుకోవాలని చెప్పాడు.
‘‘అతను తన జట్టులో స్ఫూర్తి నింపాడు. అతని సారధ్యంలో భారత జట్టు అత్యద్భుతమైన ఆటతీరు కనబరిచింది’’ అని మెచ్చుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ అనంతరం తాను టెస్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేస్తున్నట్లు కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు టీమిండియా తర్వాతి టెస్టు కెప్టెన్ ఎవరనే చర్చ భారత క్రికెట్ ప్రపంచంలో పెద్ద తలనొప్పిగా మారింది. వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ పేరు వినిపిస్తున్నప్పటికీ, అతన్ని ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. మరో చాయిస్‌గా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ రిషభ్ పంత్, బౌలర్ బుమ్రా పేర్లు వినిపిస్తున్నాయి.