ఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్‌లో భారత జట్టు తొలి రోజే అదరగొట్టింది. ఢిల్లీలోని కర్ణిసేన షూటింగ్ రేంజ్లో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో భారత్ మూడు పతకాలూ గెలిచి క్లీన్‌స్వీప్ చేసింది.
ఇటీవల కజకిస్థాన్‌లో ముగిసిన ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో స్వర్ణం గెలిచిన యువ షూటర్ అనుష్క ఠాకూర్.. అదే జోరును కొనసాగిస్తూ గురువారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో 621.6 పాయింట్లు స్కోరుచేసి బంగారు పతకం గెలిచింది. అనిష్క (619.2) రజతం నెగ్గగా ఆధ్య అగర్వాల్ (615.9) కాంస్యం నెగ్గింది. ఇదే క్యాటగిరీ పురుషుల ఈవెంట్లో దీపేంద్ర సింగ్ షెకావత్ (617.9) రెండో స్థానంలో నిలిచి సిల్వర్ సాధించగా రోహిత్ (616.3) కాంస్యం గెలిచాడు.