షూటింగ్ జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్
లిమా:ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ షూటర్ ఈషా సింగ్ రజత పతకంతో మెరిసింది. గురువారం జరిగిన మహిళల 10మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో స్టార్ షూటర్ మను భాకర్(241.3) పసిడి పతకంతో మెరువగా, ఇషా సింగ్(240.0) రజతం సొంతం చేసుకుంది. భారత్‌కే చెందిన రిథమ్ రెండు పాయింట్ల తేడాతో కాంస్య పతకం చేజార్చుకుంది. మొత్తం 49 మంది షూటర్లు పాల్గొన్న 10మీటర్ల పిస్టల్ అర్హత రౌండ్లో భాకర్ ఈషా సింగ్(572), శిఖా నార్వల్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్స్‌కు అర్హత సాధించారు. ముఖ్యంగా 16 ఏండ్ల ఈషాసింగ్ ప్రత్యర్థులకు దీటైన సవాల్ విసురుతూ పాయింట్లు కొల్లగొట్టింది. మరోవైపు పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రుద్రాంశ్ పాటిల్ రజత పతకంతో మెరిశాడు. మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ ఈవెంటులో రమిత(229.1) కాంస్య పతకం దక్కించుకుంది. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ తర్వాత జరుగుతున్న ఈ మెగా టోర్నీలో 32 దేశాల నుంచి 370 మంది షూటర్లు పోటీపడుతున్నారు.