Ishan Kishan | మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఔట్ అయిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. బౌలింగ్ టీమ్ నుంచి ఒక్కరు కూడా అప్పీల్ చేయకున్నా.. అంపైర్ అత్యుత్సాహంతో చేయి లేపాలా.. వద్దా? అని సంశయిస్తున్న తరుణంలో ఇషాన్.. తానేదో గొప్ప త్యాగం చేసినట్టుగా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ క్రీజును వదిలాడు. కానీ టీవీ రిైప్లె చూశాక గానీ అర్ధం కాలేదు తాను తప్పులో కాలేశానని! అసలే ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్‌లో సెంచరీని మినహాయిస్తే కనీసం డబుల్ డిజిట్ స్కోరు చేయడానికీ నానా తంటాలు పడుతున్న ఇషాన్.. ముంబై మ్యాచ్‌లో అయినా రాణిస్తాడని అంతా ఆశించారు. కానీ విధి మరోలా తలచింది. అసలేం జరిగిందంటే.. ట్రావిస్ హెడ్ నిష్క్రమించిన తర్వాత ఇషాన్ క్రీజులోకి వచ్చాడు. చాహర్ మూడో ఓవర్లో తొలి బంతిని లెగ్ సైడ్ దిశగా సంధించాడు. దానిని ఇషాన్ ఆడబోయినా బంతి అది కాస్తా మిస్ అయి వికెట్ కీపర్ చేతుల్లో పడింది. కీపర్ రికెల్టన్ బంతినందుకున్నాక యథావిధిగా దానిని ఇతరులకు పాస్ చేశాడు. చాహర్ కూడా మరో బంతి వేయడానికి వెళ్తున్నాడు.
ముంబై ఫీల్డర్లూ స్తబ్దుగానే ఉండగా అంపైర్.. చేతిని కాస్త పైకి లేపి ‘ఎవరూ అప్పీల్ చేయరేంటి?’ అన్నట్టుగా అటూఇటూ చూస్తూ ఔట్ ఇవ్వాలా? వద్దా? అని సంశయించాడు. అంపైర్ అత్యుత్సాహాన్ని గమనించిన చాహర్ పూర్తిగా అప్పీల్ చేయకముందే అప్పటికే సగం లేచి ఉంచిన చేతిని పూర్తిగా లేపి ‘ఔట్’ అని ప్రకటించి తన భారం దించుకున్నాడు. ఈ క్రమంలో ఇషాన్.. బంతి బ్యాట్‌కు తాకి ఉండొచ్చన్న అపనమ్మకంతో పెవిలియన్ దిశగా నడిచాడు. కనీసం రివ్యూ కూడా తీసుకోలేదు. అదే సమయంలో అక్కడే ఉన్న ముంబై ఆటగాళ్లు.. మనోడి క్రీడా స్ఫూర్తిని మెచ్చుకున్నారు. కానీ టీవీ రిైప్లెలో బంతి అసలు బ్యాట్‌కు తాకనే లేదని స్పష్టంగా తేలింది. దీంతో ఇషాన్‌ది క్రీడా స్ఫూర్తా? లేక తెలివితక్కువతనమో అర్థం కాక సన్‌రైజర్స్ అభిమానులు జుట్టు పీక్కున్నారు.