IPL 2025 : ఐండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయంతో ఆరంభించింది. సొంత మైదానంలో చెలరేగి ఆడిన ఆరెంజ్ ఆర్మీ 44 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించింది. యువకెరటం ఇషాన్ కిషన్(106 నాటౌట్) మెరుపు సెంచరీతో గర్జించగా.. గత సీజన్ ఫామ్ కొనసాగిస్తూ ట్రావిస్ హెడ్(67) ఊచకోత కోశాడు. భారీ ఛేదనలో సిమర్జీత్ సింగ్ దెబ్బకు కష్టాల్లో పడిన ప్రత్యర్థిని కమిన్స్ సేన 242కే కట్టడి చేసింది. సంజూ శాంసన్(66), ధ్రువ్ జురెల్(70)లు పోరాడినప్పటికీ రాజస్థాన్ ఓటమిని తప్పించలేకపోయారు.
ఐపీఎల్లో రికార్డు బ్రేకర్ అయిన సన్‌రైజర్స్ పంజా విసిరింది. ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌ను వణికిస్తూ సూపర్ విక్టరీ సాధించింది. టాస్ ఓడినప్పటికీ.. ఇషాన్ కిషన్(106 నాటౌట్ 11 ఫోర్లు, 6 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌తో జట్టుకు కొండంత స్కోర్ అందించాడు. భారీ ఛేదనలో రాజస్థాన్‌కు సిమర్జిత్ ఊహించని షాకిచ్చాడు.
So run it up, the Sun is up 🔥🧡#PlayWithFire | #SRHvRR | #TATAIPL2025 pic.twitter.com/C8xHw0wle8
— SunRisers Hyderabad (@SunRisers) March 23, 2025
ఓపెనర్ యశస్వీ జైస్వాల్(1), కెప్టెన్ రియాన్ పరాగ్(4)ను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాఉ. 24 పరుగులకే ఇద్దరు ప్రధాన బ్యాటర్లు పెవిలియన్ చేరగా.. షమీ ఓవర్లో నితీశ్ నితీశ్ రానా(11) పేలవ షాట్ ఆడి కమిన్స్‌కు తేలికైన క్యాచ్ ఇచ్చాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సంజూ శాంసన్(66), ధ్రువ్ జురెల్(70)లు ధాటిగా ఆడారు. అర్ధ శతకాలతో చెలరేగిపోతున్న సంజూ(66)ను ఔట్ చేసిన హర్షల్ పటేల్.. 111 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆఖర్లో శుభమ్ దూబే(34), షిమ్రాన్ హిట్మైర్(42) ధనాధన్ ఆడినా ఫలితం లేకపోయింది.
ఐపీఎల్ కెరియర్లో తొలి శతకం బాదిన ఇషాన్ కిషన్ బౌండరీల మీద బౌండరీలు బాదేస్తూ రాజస్థాన్ బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగించాడు. అంతకంటే ముందు ఓపెనర్లు ట్రావిస్ హెడ్(67), అభిషేక్ శర్మ(24)లు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడి మరీ ఫోర్లు, సిక్సర్లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడి శుభారంభం ఇచ్చారు.
ISHAN ‘THE CENTURION’ KISHAN 😮💨🔥#PlayWithFire | #SRHvRR | #TATAIPL2025 pic.twitter.com/MVAFEy34Tn
— SunRisers Hyderabad (@SunRisers) March 23, 2025
అయితే.. స్పిన్నర్ థీక్షణ ఓవర్లో కవర్స్‌లో భారీ షాట్ ఆడిన అభిషేక్ .. యశస్వీ జైశ్వాల్ ఒడుపుగా క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. 45 పరుగుల వద్ద తొలి వికెట్‌గా అభిషేక్‌ను వెనుదిరిగాక.. ఇషాన్ కిషన్(106 నాటౌట్) జతగా హెడ్ విజృంభించాడు. ఆర్చర్ బౌలింగ్‌లో వరుసగా 4, 6, 4.. ఆఖరి రెండు బంతుల్ని సైతం ఫోర్లుగా మలిచాడు. ఇక థీక్షణ బౌలింగ్‌లో ఇద్దరూ తలా రెండేసి ఫోర్లు బాదడంతో.. ఆరెంజ్ ఆర్మీ జట్టు పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 94 రన్స్ కొట్టింది. ఆ తర్వాత అర్ధ శతకం సాధించిన హెడ్‌ను తుషార్ దేశ్‌పాండే పెవిలియన్ చేర్చాడు. 134 వద్ద ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయినా.. నితీశ్ కుమార్ రెడ్డి(5)తో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నిర్మించాడు ఇషాన్. వీళ్ల జోరుతో 15వ ఓవర్లోనే జట్టు స్కోర్ 200 దాటింది. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్(34) అండతో ఇషాన్ మరింత ధాటిగా ఆడి.. సందీప్ శర్మ వేసిన 19వ ఓవర్లో వరుస సిక్సర్లతో సెంచరీకి చేరువయ్యాడు. దాంతో, హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేయగలిగింది.