వన్డే క్రికెట్లో అతి తక్కువ (126) బంతుల్లో ద్విశతకం చేసిన ఆటగాడిగా ఇషాన్ కిషన్ చరిత్రకెక్కాడు. గేల్ (138 బంతుల్లో) రెండో స్థానానికి చేరాడు.
ఆహా ఏమా ఆట.. ఏమా బాదుడు..
బంతే భయపడిపోయేలా..
బౌలర్లు బెంబేలెత్తిపోయేలా..
ప్రేక్షకులు సంబురపడిపోయేలా..
అభిమానులు ఉర్రూతలూగేలా..
యువ ఆటగాడు ఇషాన్ కిషన్
బంగ్లా బౌలర్లపై వీరంగమాడాడు.
ఇప్పటికే సిరీస్ కోల్పోవడంతో.. పోరాడితే పోయేదేమి లేదన్న చందంగా బరిలోకి దిగిన ఈ ఓపెనర్.. రికార్డు డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. పిట్ట కొంచం కూత ఘనం అన్న తరహాలో.. ఆడుతున్న పదో వన్డేలోనే ద్విశతకంతో అదరగొట్టాడు. పట్టుమని పాతికేండ్లు నిండని ఓ యువ ఆటగాడు మైదానంలో శివతాండవమాడుతూ ప్రత్యర్థిపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుంటే.. నాన్ స్ట్రయికింగ్ ఎండ్ నుంచి నవ్వుతూ వీక్షించిన రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ కూడా సెంచరీ నమోదు చేసుకోవడంతో బంగ్లాదేశ్‌తో నామమాత్ర వన్డేలో టీమ్ఇండియా జయభేరి మోగించింది.
ఇషాన్ ఒక్కడే 210 పరుగులు చేస్తే.. బంగ్లాదేశ్ జట్టు మొత్తం కలిసి 182 పరుగులకే పరిమితమవడం కొసమెరుపు.
ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్నా.. మరో 15 ఓవర్ల ఆట మిగిలుండగానే ఔటయ్యా. దిగ్గజాల సరసన నా పేరు చేరడం ఆనందంగా ఉంది. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండటంతో బంతిని బలంగా బాదడమే పనిగా పెట్టుకున్నా. మరో ఎండ్‌లో విరాట్ భాయ్ ఉండటం నాకు కలిసొచ్చింది. ఏ బౌలర్‌ను టార్గెట్ చేయాలో కోహ్లీ సూచించాడు. 95 పరుగుల వద్ద సిక్సర్‌తో సెంచరీ చేయాలనుకున్నా.. కానీ తొలి అంతర్జాతీయ శతకం కాబట్టి జాగ్రత్తగా ఆడమని కోహ్లీ అన్నాడు. అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకున్నా.. ఒత్తిడిగా భావించలేదు.
-ఇషాన్ కిషన్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
చటోగ్రామ్: చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా.. సిరీస్ కోల్పోయాక టీమ్ఇండియా సమష్టిగా విజృంభించింది. బంగ్లాదేశ్‌తో తొలి రెండు వన్డేల్లో పోరాడి ఓడిన భారత్.. శనివారం ఆఖరి పోరులో 227 పరుగుల తేడాతో రికార్డు విజయం నమోదు చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (131 బంతుల్లో 210; 24 ఫోర్లు, 10 సిక్సర్లు) డబుల్ సెంచరీ చేయగా.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (91 బంతుల్లో 113; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) శతక్కొట్టాడు. శిఖర్ ధవన్ (3), శ్రేయస్ అయ్యర్ (3), కెప్టెన్ కేఎల్ రాహుల్ (8) విఫలం కాగా.. సుందర్ (37), అక్షర్ (20) విలువైన పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో షకీబ్, ఇబాదత్, తస్కిన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 34 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది. షకీబ్ (43) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో శార్దూల్ 3, అక్షర్, ఉమ్రాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇషాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కగా.. మూడు మ్యాచ్‌ల్లో కలిపి 141 పరుగులతో పాటు 4 వికెట్లు పడగొట్టిన బంగ్లా ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య బుధవారం నుం చి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడటంతో అతడి స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టాడు. ఇప్పటికే సిరీస్ కోల్పోయి డీలాపడ్డ భారత జట్టులో ఈ యువ ఓపెనర్ జోష్ నింపాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే ధవన్ ఔట్ కావడంతో టీమ్ఇండియాకు శుభారంభం దక్కలేదు. ఈ దశలో మాజీ కెప్టెన్ విరాట్ జతకలవడంతో ఇషాన్ ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తుండటంతో.. నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన ఇషాన్.. కోహ్లీని నాన్‌స్ట్రయికర్ ఎండ్‌లో ప్రేక్షకుడిలా నిలబెట్టి.. బంగ్లా బౌలర్లను ఉతికి ఆరేశాడు. 49 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న ఇషాన్.. ఆ తర్వాత జోరు పెంచాడు. మరో 36 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇబాదత్, షకీబ్, మెహదీ.. ఇలా బౌలర్ ఎవరైనా బంతిని స్టాండ్స్‌లోకి పంపడమే పనిగా పెట్టుకున్నట్లు ఇషాన్ వీరంగమాడాడు. ముస్తఫిజుర్ యార్కర్‌కు సింగిల్ తీయడం ద్వారా డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అప్పటికి మరో 15 ఓవర్ల ఆట మిగిలి ఉండటంతో ఇషాన్ మరింత భారీ స్కోరు చేయడం ఖాయం అనుకుంటున్న దశలో తస్కిన్ అతడిని ఔట్ చేశాడు. ఆ తర్వాత గేర్ మార్చిన కోహ్లీ వన్డేల్లో 44వ శతకం పూర్తి చేసుకున్నాడు. 2019 తర్వాత ఈ ఫార్మాట్లో విరాట్కిదే తొలి సెంచరీ కావడం గమనార్హం. శ్రేయస్, రాహుల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.
3. వన్డేల్లో భారత్ తరఫున ఇది (210) మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు. రోహిత్ 264 (శ్రీలంకపై), సెహ్వాగ్ 219
(వెస్టిండీస్)పై తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
1. పిన్న వయసు (24 సంవత్సరాల 145 రోజులు)లో డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా ఇషాన్ నిలిచాడు. రోహిత్ శర్మ (26 సంవత్సరాల 186 రోజులు; 2013లో ఆస్ట్రేలియాపై ద్విశతకం) రెండో స్థానంలో ఉన్నాడు.
3. పరుగుల పరంగా భారత్‌కిది మూడో అతిపెద్ద విజయం. బెర్ముడాపై (257 పరుగుల తేడాతో), హాంకాంగ్‌పై (256 పరుగుల తేడాతో) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
2.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా విరాట్ నిలిచాడు. సచిన్ టెండూల్కర్ వంద శతకాలతో టాప్‌లో ఉండగా..
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (72).. రికీ పాంటింగ్ (71)ను అధిగమించాడు.
1. వన్డే కెరీర్లో తొలి సెంచరీనే ద్విశతకంగా మలిచిన మొదటి ప్లేయర్‌గా ఇషాన్రికార్డు నెలకొల్పాడు.
4. భారత్ తరఫున డబుల్ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా ఇషాన్ నిలిచాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కో ద్విశతకం సాధించగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మూడు సార్లు ఈ ఫీట్ నమోదు చేసుకున్నాడు.
156 ఫోర్లు, సిక్సర్ల ద్వారా ఇషాన్ రాబట్టిన పరుగులు. వన్డేల్లో ఇది మూడో అత్యధికం. రోహిత్ 186 (శ్రీలంకపై 2014లో), గప్టిల్ 162 (వెస్టిండీస్‌పై 2015లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
భారత్: ధవన్ (ఎల్బీ) మెహదీ 3, ఇషాన్ (సి) లిటన్ (బి) తస్కిన్ 210, కోహ్లీ (సి) మెహదీ (బి) షకీబ్ 113, శ్రేయస్ (సి) లిటన్ (బి) ఇబాదత్ 3, రాహుల్ (బి) ఇబాదత్ 8, సుందర్ (బి) షకీబ్ 37, అక్షర్ (బి) తస్కిన్ 20, శార్దూల్ (సి) లిటన్ (బి) ముస్తఫిజుర్ 3, కుల్దీప్ (నాటౌట్) 3, సిరాజ్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 50 ఓవర్లలో 409/8. వికెట్ల పతనం: 1-15, 2-305, 3-320, 4-344, 5-344, 6-390, 7-405, 8-409, బౌలింగ్: ముస్తఫిజుర్ 10-0-66-1, తస్కిన్ 9-1-89-2, మెహదీ 10-0-76-1, ఇబాదత్ 9-0-8-2, షకీబ్ 10-0-68-2, అఫిఫ్ 1-0-14-0, మహ్మదుల్లా 1-0-11-0.
బంగ్లాదేశ్: అన్మోల్ (సి) సిరాజ్ (బి) అక్షర్ 8, లిటన్ (బి) శార్దూల్ (బి) సిరాజ్ 29, షకీబ్ (బి) కుల్దీప్ 43, రహీమ్ (బి) అక్షర్ 7, యాసిర్ (ఎల్బీ) ఉమ్రాన్ 25, మమ్మదుల్లా (ఎల్బీ) సుందర్ 20, అఫిఫ్ (సి) ఉమ్రాన్ (బి) శార్దూల్ 8, మెహదీ (సి) సిరాజ్ (బి) శార్దూల్3, తస్కిన్ (నాటౌట్) 17, ఇబాదత్ (ఎల్బీ) శార్దూల్ 0, ముస్తఫిజుర్ (బి) ఉమ్రాన్ 13, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 34 ఓవర్లలో 182 ఆలౌట్. వికెట్ల పతనం: 1-33, 2-47, 3-73, 4-107, 5-124, 6-143, 7-145, 8-148, 9-149, 10-182, బౌలింగ్: సిరాజ్ 5-0-27-1, శార్దూల్ 5-0-30-3, అక్షర్ 5-0-22-2, ఉమ్రాన్ 8-0-43-2, కుల్దీప్ 10-1-53-1, సుందర్ 1-0-2-1.