Ishan Kishan: టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మరోసారి హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆదేశాలను బేఖాతరు చేశాడు. సౌతాఫ్రికా టూర్లో ఉన్నట్టుండి ‘వ్యక్తిగత కారణాల’తో స్వదేశానికి వచ్చిన ఇషాన్.. ఇండియాలో ఇటీవలే ముగిసిన అఫ్గాన్‌తో సిరీస్‌లో కూడా ఆడలేదు. కొద్దిరోజుల క్రితమే భారత సెలక్టర్లు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండు టెస్టులకు జట్టును ప్రకటించారు. కానీ అందులో ఇషాన్ పేరు లేదు. అఫ్గాన్‌తో సిరీస్‌కు ముందు టీమిండియా కోచ్ ద్రావిడ్.. ఇషాన్‌పై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుందన్న వార్తలు అవాస్తవమని, కానీ అతడు తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీలో ఆడి కమ్‌బ్యాక్ ఇవ్వాలని సూచించాడు. అయితే ఇషాన్ మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు.
రంజీ ట్రోఫీ మూడో రౌండ్లోనూ ఇషాన్.. జార్ఖండ్ తరఫున ఆడటం లేదు. మూడో రౌండ్ మ్యాచ్‌లు అయినా ఆడితే సెలక్టర్లు ఇషాన్‌ను మిగతా మూడు టెస్టులకు పట్టించుకుంటారని లేకుంటే ఇదివరకే ధ్రువ్ జురెల్, కోన శ్రీకర్ భరత్ వంటి స్పెషలిస్ట్ వికెట్ కీపర్లను ఎంపిక చేసిన సెలక్టర్లు వాళ్లతోనే కొనసాగే అవకాశం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నా ఈ జార్ఖండ్ కుర్రాడు మాత్రం తనకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తన్నాడు. అసలు ఇషాన్ ఎందుకు రంజీలు ఆడటం లేదన్నది జార్ఖండ్ టీమ్‌మేట్స్‌కు కూడా క్లారిటీ లేదు. అతడు ఎవరితోనూ సరిగా మాట్లాడటం లేదని, ఈ మౌనదీక్ష ఎన్నాళ్లనేది అతడికే తెలియాలని వాళ్లు వాపోతున్నారు.
🏃♂️ pic.twitter.com/XjUfL18Ydc
— Ishan Kishan (@ishankishan51) January 12, 2024
సౌతాఫ్రికా నుంచి తిరిగొచ్చాక ఇషాన్.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నిర్వహించే ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో పాల్గొన్నాడు. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం.. బోర్డుతో కాంట్రాక్టు ఉన్న క్రికెటర్ ఏదైనా టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా అతడు ఏదైనా మాట్లాడాలన్నా కూడా సంబంధిత సభ్యుల అనుమతి తీసుకోవాలి. కానీ ఇషాన్ మాత్రం అటువంటిదేమీ లేకుండానే బిగ్ బి షో లో పాల్గొన్నాడని, అందుకే బీసీసీఐ అతడిపై క్రమశిక్షణా చర్యలకు పాల్పడటంతోనే అతడు హర్ట్ అయ్యాడని వార్తలు వినిపించాయి. అంతేగాక ఇషాన్ సౌతాఫ్రికా నుంచి వచ్చినప్పుడు మానసిక సమస్యల కారణంగా జట్టుకు కొన్ని రోజులు దూరంగా ఉండనున్నాడని వార్తలొచ్చాయి. ఏదేమైనా అసలు ఇషాన్ ఎందుకు దేశవాళీలు ఆడటం లేదు..? ఇదే వైఖరికి కంటిన్యూ చేస్తే తిరిగి అతడు జాతీయ జట్టులోకి వస్తాడా..? అన్నది ఇప్పుడు సమాధానాలు దొరకని ప్రశ్నలుగా ఉన్నాయి. వీటికి ఇషానే సమాధానం చెప్పాలి మరి..!