అబుదాబి: పేస్ బౌలర్ కర్టిస్ క్యాంపర్ 4 బంతుల్లో 4 వికెట్లతో విజృంభించడంతో టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్ బోణీ కొట్టింది. గ్రూప్-‘ఎ’లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై విజ యం సాధించింది. క్యాంపర్ (4/26), మార్క్ అదిర్ (3/9) ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ మ్యాక్స్ ఓ డౌడ్ (51) అర్ధశతకం సాధించగా.. మిగిలినవాళ్లు విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ క్యాంపర్ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్ రెండో బంతికి కొలిన్ అకెర్మన్ (11) ఔట్ కాగా.. ఆ తర్వాత వరుసగా టెన్ డస్కటే (0), స్కాట్ ఎడ్వర్ట్స్ (0), వన్ డెర్ మెర్వ్ (0) పెవిలియన్ బాట పట్టారు. దీంతో క్యాంపర్ హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 15.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసి గెలిచింది. పాల్ స్టిర్లింగ్ (30 నాటౌట్), గారెత్ డెలానీ (44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో నమీబియాపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 19.3 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనలో లంక 13.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది.
2 టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ పడగొట్టిన రెండో బౌలర్‌గా క్యాంపర్ నిలిచాడు. గతంలో ఆసీస్ స్పిడ్స్టర్ బ్రెట్‌లీ ఈ ఘనత సాధించాడు.
3 అంతర్జాతీయ టీ20ల్లో వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్ క్యాంపర్. లసిత్ మలింగ, రషీద్ ఖాన్ గతంలో ఈ ఫీట్ సాధించారు.