ICC Player Of The Month : పసికూన ఐర్లాండ్(Ireland) జట్టు నయా సంచలనం హ్యారీ టెక్టర్(Harry Tector) అరుదైన ఘనత సాధించాడు. మే నెలకుగానూ అతను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్(ICC’s Player Of The Month) అవార్డు అందుకున్నాడు. దాంతో, ఈ అవార్డుకు ఎంపికైన తొలి ఐర్లాండ్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ అవార్డు కోసం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam), బంగ్లాదేశ్ ఆటగాడు నజ్ముల్ హొసేన్ శాంటో(Najmul Hossain Shanto) పోటీలో నిలిచారు. అయితే.. ఓటింగ్‌లో ఈ ఇద్దరి కంటే టెక్టర్కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దాంతో, ఐసీసీ ప్యానెల్ టెక్టర్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
‘ఐసీసీకి థ్యాంక్యూ.. ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఓటు వేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు. క్రికెట్ అనేది జట్టుగా ఆడాల్సిన ఆట. ఐర్లాండ్ పురుషుల జట్టు అద్భుత ప్రదర్శనకు, రాటుదేలుతున్న తీరుకు ఈ అవార్డు నిదర్శనం. జట్టు కోచ్, సహాయక సిబ్బంది సహకారం లేకుంటే నేను ఈ అవార్డుకు ఎంపికయ్యే వాడినే కాదు’ అని టెక్టర్ తెలిపాడు.
బంగ్లాదేశ్ సిరీస్‌లో సెంచరీ కొట్టిన హ్యారీ టెక్టర్(140)
ఈ మధ్యే ఐర్లాండ్ మూడు వన్డేల సిరీస్ కోసం బంగ్లాదేశ్ పర్యటకు వెళ్లింది. ఈ సిరీస్‌లో 23 ఏళ్ల టెక్టర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వర్షార్పణం అయిన తొలి వన్డేలో అతను 21 రన్స్ కొట్టాడు. కీలకమైన రెండో వన్డేలో టెక్టర్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 113 బంతుల్లోనే 140 పరుగులు సాధించాడు. అతడి విధ్వంసక ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లు ఉన్నాయి. ఆఖరిదైన మూడు వన్డేలోనూ టెక్టర్ 45 రన్స్‌తో రాణించాడు. ఇప్పటివరకు టెక్టర్ 32 వన్డేలు, 57 టీ20లుమాత్రమే ఆడాడు.