IPL-2022 | వచ్చేనెల నుంచి రెండు నెలల పాటు సాగే ఐపీఎల్ సంరంభంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు పూర్తిగా పాల్గొనే అవకాశాల్లేవు. పాకిస్థాన్‌తో వన్డే, టీ-20 సిరీస్‌ల్లో పాల్గొననున్న నేపథ్యంలో ఐపీఎల్లో పూర్తి మ్యాచ్‌లకు సీనియర్ ఆసీస్ ప్లేయర్లు అందుబాటులో ఉండరు. ఇటీవలే ఏప్రిల్ ఆరో తేదీ వరకు తమ క్రికెటర్లు ఐపీఎల్‌కు అందుబాటులో ఉండరని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. ఆసీస్-పాక్ మధ్య వన్డే సిరీస్ మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 వరకు, ఏకైక టీ-20 మ్యాచ్ ఏప్రిల్ ఐదో తేదీన జరుగుతుంది.
వచ్చేనెల 26 నుంచే ఐపీఎల్-2022 టోర్నీ ప్రారంభం కానున్నట్లు సమాచారం. టోర్నీ ప్రసార హక్కులు పొందిన స్టార్ స్పోర్ట్స్ కూడా వచ్చేనెల 26న (శనివారం) టోర్నమెంట్ ప్రారంభం కావాలని కోరుకుంటున్నట్లు తెలిసింది. 27న (ఆదివారం) రెండు మ్యాచ్‌లు ఆడితే బాగుంటుందని స్టార్ స్పోర్ట్స్ అంచనా వేస్తుందట. తొలి రెండు రోజుల్లో మూడు మ్యాచ్‌లు జరిగే సానుకూల వాతావరణం నెలకొంటుందని ఓ ఫ్రాంచైసీ అధికారి ఒకరు చెప్పారు. ఇప్పటికైతే బీసీసీఐ నుంచి గానీ, స్టార్ స్పోర్ట్స్ నుంచి గానీ దీనిపై ఎటువంటి ప్రకటన రాలేదు.
సఫారీలతో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడే ప్రసక్తే లేదని కివీస్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ తేల్చేశాడు. దీంతో నేరుగా అతడు ఐపీఎల్ టోర్నీలో పాల్గొనవచ్చు. తొలి టెస్టులోనూ జట్టు యాజమాన్యం ఆయన పేరు చేర్చలేదు. ప్రస్తుతం ట్రెంట్ బౌల్డ్ పితృత్వ సెలవుల్లో ఉన్నాడు. సెలవులు ముగిసిన తర్వాత కూడా అంటే రెండో టెస్ట్‌కు కూడా బౌల్ట్‌ను దూరంగా ఉంచాలని న్యూజిలాండ్ టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు వినికిడి. తమ క్రీడాకారులపై పని భారం తగ్గించడానికి కివీస్ ప్రయత్నిస్తున్నదట. ట్రెంట్ బౌల్ట్‌ను రూ.8 కోట్లకు రాజస్థాన్ రాయల్స్‌కు కొనుగోలు చేసింది. వచ్చే జూన్‌లో ఇంగ్లండ్ టూర్లో కివీస్ జట్టులో పాల్గొననున్నారు.