IPL 2026 | దక్షిణాఫ్రికా డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ ఫఫ్ డు ప్లెసిస్‌ను జట్టును తప్పించడం అంత తేలిక నిర్ణయం కాదని ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ హేమంగ్ బదాలీ పేర్కొన్నారు. డు ప్లెసిస్ తన ఐపీఎల్ కెరీర్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ బరిలోకి దిగాడు. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో సభ్యుడిగా ఉన్నాడు. అయితే, బదానీ మాట్లాడుతూ ‘ఫఫ్ డు ప్లెసిస్ లాంటి ఆటగాడిని వదులుకోవడం అంత సులభం కాదు. సంవత్సరాలుగా ఐపీఎల్లో అద్భుతంగా రాణించాడు. అతని జట్టులో నుంచి తప్పించడం కఠినమైన నిర్ణయం’ అని జియోస్టార్‌లో జరిగిన టాటా ఐపీఎల్ రిటెన్షన్ షోలో బదానీ వ్యాఖ్యానించాడు.
మరింత దూకుడుగా ఉండే, జట్టు ఆటతీరుకు అనుగుణంగా మారే యువ ప్లేయర్ల కోసం ప్రయత్నించాల్సిన సమయం ఆసన్నమైందని భావించామని తెలిపాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌ను విడుదల చేయాలనే నిర్ణయంపై బదానీ స్పందిస్తూ.. గత సీజన్లో ప్రదర్శన ఆధారంగా అతనికి మద్దతు ఇచ్చామని.. కానీ అతనికి రూ.9 కోట్లు ఇవ్వడం సాధ్యం కాదని ప్రస్తుతం భావించి.. అతన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌లో మంచి భారతీయ ప్లేయర్లు ఉన్నారని.. కానీ ఓపెనింగ్ జోడీపై పని చేయాల్సిన అవసరం ఉందని భారత జట్టు మాజీ హెడ్‌కోచ్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డారు. నితీశ్ రాణా, కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్ జట్టులో ఉన్నారని.. టాప్ ఆర్డర్లో ఎవరు ఎక్కడ ఆడాలో నిర్ణయించాల్సి ఉంటుందన్నారు.