IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్‌లో సీఎస్కే బ్యాటర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ అత్యంత చర్చనీయాంశంగా మారింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన చివరి మ్యాచ్‌లో ధోనీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆదివారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. సీఎస్కే జట్టు మేనేజ్మెంట్తో పాటు ధోనీ నిర్ణయంపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. తాజాగా సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ మార్పుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. ధోని మోకాలి సమస్యతో బాధపడుతున్నాడని.. గతంలో మాదిరిగా పరుగులు రాబట్టలేడని.. ఇకపై పది ఓవర్లు బ్యాటింగ్ చేయలేడని ఫ్లెమింగ్ అసలు విషయాన్ని బయటపెట్టాడు.
మ్యాచ్ పరిస్థితిని బట్టి మాజీ కెప్టెన్ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను నిర్ణయించుకుంటాడని తెలిపాడు. సీఎస్కే బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో, రాజస్థాన్‌పై ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో జట్టుకు 25 బంతుల్లో 54 పరుగులు అవసరం కానీ. కానీ మహి 11 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మ్యాచ్ తర్వాత విలేకరుల సమావేశంలో ఫ్లెమింగ్ మాట్లాడుతూ ఇది సమయానికి సంబంధించిన విషయమని.. ధోని స్వయంగా అంచనా వేస్తాడని తెలిపాడు. అతని శరీరం, మోకాలు మునుపటిలా లేవు. అతను బాగా నడుస్తున్నాడని.. పది ఓవర్లు పూర్తి బలంగా బ్యాటింగ్ చేయలేడని ఫ్లెమింగ్ చెప్పాడు. మ్యాచ్ రోజున పరిస్థితిని అంచనా వేసుకొని బ్యాటింగ్‌కి వస్తాడని.. జట్టుకు ఏం కావాలో తెలుసునని.. మ్యాచ్ సమతుల్యంగా ఉంటే.. కొంచెం ముందుగానే బ్యాటింగ్‌కు వస్తాడని.. ఇతర సందర్భాల్లో ఇతర ప్లేయర్‌కు మద్దతు తెలుపుతాడని చెప్పారు.
గతేడాది ధోని మాకు చాలా విలువైనవాడని తాను చెప్పానని.. జట్టుకు దిశానిర్దేశం చేయడం, వికెట్ కీపింగ్ చేయడంతో పాటు తొమ్మది, పదో ఓవర్లో అతన్ని బ్యాటింగ్‌కు పంపడం సరైంది కాదన్నారు. ఇంతకు ముందు కూడా మహి ముందుగానే బ్యాటింగ్‌కు రాలేదని.. 13-14 ఓవర్ల మధ్య మాత్రమే మైదానంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడని చెప్పారు. ఆ సమయంలో మైదానంలో ఎవరు ఉన్నారనేదానిపై ఆధారపడి ఉంటుందని కోచ్ పేర్కొన్నారు. పవర్ ప్లేలో ఆర్ఆర్ వికెట్ కోల్పోయి 79 పరుగులు చేయగా.. సీఎస్కే వికెట్ నష్టానికి కేవలం 42 పరుగులు మాత్రమే చేసిందని.. పవర్ ప్లేలోనే తాము మ్యాచ్‌ని ఓడిపోయామని ఫ్లెమింగ్ అంగీకరించారు. బౌలింగ్‌లో, పవర్‌ప్లేలో 80 పరుగులు ఇచ్చామని.. బ్యాటింగ్‌లో 40 పరుగులు మాత్రమే సాధించగలిగినట్లు పేర్కొన్నారు. అలాగే ఫీల్డింగ్‌లో బలహీనంగా ఉందని పేర్కొన్నారు. రాజస్థాన్ అద్భుతంగా ఫీల్డింగ్ చేసిందని ఫ్లెమింగ్ పేర్కొన్నారు. హసరంగ అద్భుతంగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు.