IPL | ముంబై : త్వరలో జరుగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల (రిటెన్షన్) జాబితాను గురువారం విడుదల చేశాయి. రిటెన్షన్‌లో స్టార్ క్రికెటర్లు భారీ ధర దక్కించుకున్నా చాలా ఫ్రాంచైజీలు యువ క్రికెటర్లపై కాసుల వర్షం కురిపించాయి. యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, రజత్ పాటిదార్ , రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, సాయి సుదర్శన్ వంటి కుర్రాళ్లకు జాక్‌పాట్ దక్కింది. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయా ఫ్రాంచైజీలు ఔత్సాహిక క్రికెటర్లపై కోటానుకోట్లు కుమ్మరించాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌కు అత్యధికంగా రూ. 23 కోట్లు వెచ్చించింది. ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీకి భారత ఆటగాళ్లలో మునుపెన్నడూ లేనంతగా ఏకంగా ఆ జట్టు రూ. 21 కోట్లు పెట్టి రిటైన్ చేసుకోగా ముంబైని వీడతాడని ఊహాగానాలు వచ్చినా రోహిత్ శర్మ ఆ జట్టుతోనే కొనసాగనున్నాడు. ఈ సీజన్లో దిగ్గజ సారథి మహేంద్రసింగ్ ధోనీ తన కెరీర్లో తొలిసారి అన్క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు. పంజాబ్ మినహా మిగిలిన జట్లు తమ కోర్ గ్రూప్ ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. రిటెన్షన్ లిస్ట్‌లో లేని ఆటగాళ్లు ఈ నెల చివరివారంలో జరగాల్సి ఉన్న వేలంలో పాల్గొంటారు.
లక్నో రిటెన్షన్ జాబితా అనంతరం ఆ జట్టు యజమాని సంజీవ్ గొయెంకా చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. ‘ఆటగాళ్ల ఎంపికలో మేము గెలవాలన్న లక్ష్యంతో ఉన్నవారినే ఎంపికచేశాం. వ్యక్తిగత లక్ష్యాలకు దూరంగా జట్టు విజయం కోసం ఆడేవారికే ప్రాధాన్యతనిచ్చాం’ అని చెప్పడం వివాదాస్పదమైంది. కేఎల్ రాహుల్‌ను ఉద్దేశించే గొయెంకా ఆ వ్యాఖ్యలు చేసి ఉంటాడని ఆయనపై నెట్టింట అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తమ సారథులను వేలానికి వదిలేశాయి. అందరూ ఊహించినట్టుగానే రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ వేలంలోకి వస్తుండగా పదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోల్‌కతాకు టైటిల్‌ను అందించిన శ్రేయస్ అయ్యర్ కూడా వేలానికి సిద్ధమయ్యాడు. పంత్, రాహుల్, శ్రేయస్‌తో ఆయా జట్ల యాజమాన్యాలు చివరి నిమిషం వరకూ చర్చలు జరిపినా ఫలితం లేకుండాపోయింది. ఈ ముగ్గురూ వేలంలో భారీ ధర దక్కించుకునే అవకాశాలున్నాయి. వయసు రీత్యా ఆర్సీబీ డుప్లెసిస్‌ను రిటైన్ చేసుకోకపోగా కొద్దిరోజుల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్నూ పంజాబ్ వదిలేసుకుంది. గత సీజన్లో విఫలమైన మ్యాక్స్‌వెల్, సిరాజ్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదు. పంజాబ్ ఏ ఒక్క క్యాప్డ్ ప్లేయర్‌నూ రిటైన్ చేసుకోకపోవడం గమనార్హం. ఇద్దర్ని మాత్రమే ఆ జట్టు రిటైన్ చేసుకుంది. రిటెన్షన్ ప్రక్రియ ముగిశాక ఆ జట్టు ఖాతాలో అత్యధికంగా రూ. 110.5 కోట్ల నగదు మిగిలుంది. దాదాపు అన్ని ఫ్రాంచైజీలు ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా ఢిల్లీ నలుగురిని, బెంగళూరు ముగ్గురిని, పంజాబ్ ఇద్దర్ని రిటైన్ చేసుకున్నాయి.
గత సీజన్లో ఫైనలిస్టులు సన్‌రైజర్స్ అందరూ అనుకున్నట్టుగానే తమ ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. రిటెన్షన్‌లో అనూహ్యంగా క్లాసెన్‌పై రూ. 23 కోట్లు వెచ్చించిన హైదరాబాద్.. సారథి పాట్ కమిన్స్‌ను రెండో రిటెన్షన్ (రూ. 18 కోట్లు)గా తీసుకుంది. విధ్వంసక ఓపెనింగ్ ద్వయం అభిషేక్, ట్రావిస్ తలా రూ. 14 కోట్లు కొల్లగొట్టారు. యువ ఆల్‌రౌండర్ నితీశ్‌కు రూ. 6 కోట్లు దక్కాయి..