ఢిల్లీ: వారం రోజుల వాయిదా అనంతరం ఐపీఎల్ పునఃప్రారంభానికి రంగం సిద్ధమైంది. శనివారం నుంచి ఈ సీజన్ (బెంగళూరు X కోల్‌కతా మ్యాచ్‌తో) తిరిగి ప్రారంభం కానుంది. భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలతో తమ స్వదేశాలకు వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా తమ ఫ్రాంచైజీలతో కలుస్తున్నారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ క్రికెటర్లు భారత్‌కు తిరిగొచ్చారు. జోస్ బట్లర్, కగిసొ రబాడా (గుజరాత్) గురువారమే జట్టుతో చేరారు. ఆర్సీబీ ఆటగాళ్లు ఫిల్ సాల్ట్, లివింగ్‌స్టొన్, బెతెల్‌తో పాటు టిమ్ డేవిడ్, రొమారియా షెపర్డ్ బెంగళూరుకు చేరుకున్నారు. మార్క్మ్,్ర మిల్లర్, పూరన్, జోసెఫ్ మరో రెండు రోజుల్లో లక్నోతో కలిసే అవకాశమున్నట్టు ఫ్రాంచైజీ వర్గాలు ధృవీకరించాయి. మే 19న లక్నో.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉండగా ఆలోపు వీళ్లు లక్నో జట్టుతో కలిసే అవకాశముంది. హైదరాబాద్ సారథి కమిన్స్‌తో పాటు ట్రావిస్ హెడ్ కూడా నేడో రేపో భారత్‌కు రానున్నారు. మిచెల్ స్టార్క్ రాకపై అనిశ్చితి కొనసాగనుండగా ట్రిస్టన్ స్టబ్స్, డుప్లెసిస్ త్వరలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో చేరనున్నారు.
ఆరు నెలల విరామం తర్వాత ఇటీవలే రీఎంట్రీ ఇచ్చిన స్పీడ్‌గన్ మయాంక్ యాదవ్‌కు మళ్లీ గాయమైంది. వెన్నునొప్పితో మయాంక్ మిగతా సీజన్‌కు దూరమవడంతో లక్నో అతడి స్థానాన్ని కివీస్ పేసర్ విలియమ్ ఓరూర్క్తో భర్తీ చేసింది. సీజన్ ఆరంభంలోనే గాయపడ్డ పంజాబ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ ప్లేస్‌ను.. న్యూజిలాండ్‌కే చెందిన కైల్ జెమీసన్ రిప్లేస్ చేయనున్నాడు. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా ప్లేయర్లు ప్లేఆఫ్స్‌కు అందుబాటులో ఉండటం లేకపోవడంతో ఆ జట్లూ రిప్లేస్మెంట్స్పై దృష్టిసారించాయి. గుజరాత్‌కు ఆడుతున్న బట్లర్.. లీగ్ దశ ముగియగానే స్వదేశానికి వెళ్లనుండటంతో టైటాన్స్ ఆ స్థానంలో కుశాల్ మెండిస్ ను తీసుకుంది. విల్ జాక్స్ స్థానం లో బెయిర్ స్టో (ఇంగ్లండ్) భర్తీ చేయనున్నట్టు సమాచారం.
ఆసీస్ బ్యాటర్ జేక్ ఫ్రేసర్ మెక్‌గర్క్ స్థానంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను తీసుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ ‘ఎక్స్’లో నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, ఆ దేశ నాయకులు భారత్‌పై చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు, ఈశాన్య రాష్ర్టాలను స్వాధీనం చేసుకోవాలంటూ మాట్లాడుతున్న అక్కడి రాజకీయ నాయకుల తీరుపై భారత్‌లో ఆగ్రహం వెల్లువెత్తుతున్నది. కొన్ని నెలల క్రితం ముగిసిన ఐపీఎల్ వేలంలోనూ ఫ్రాంచైజీలు బంగ్లా ఆటగాళ్లపై విముఖత వ్యక్తం చేశాయి. కానీ తాజాగా టెంపరరీ రిప్లేస్మెంట్స్లో ఢిల్లీ.. ముస్తాఫిజుర్‌ను తీసుకోవడంతో నెటిజన్లు క్యాపిటల్స్ యాజమాన్యంపై దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో గురువారం ఎక్స్‌లో #బాయ్‌కాట్ ఢిల్లీక్యాపిటల్స్ ట్రెండ్ అయింది. తాజా వివాదంపై క్యాపిటల్స్ స్పందించలేదు.