IPL 2025 | పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్ బుధవారం పీవోకేలోని తొమ్మిది ఉగ్రమూకలను ధ్వంసం చేసింది. దాంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈక్రమంలోనే గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. స్టేడియాన్ని బాంబులతో పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించారు. ఉత్సాహంగా ఐపీఎల్ కొనసాగుతున్న వేళ బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఈ క్రమంలో పాక్ పేరుతో ఈ మెయిల్ బెదిరింపులో రాగా.. భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ‘ఆపరేషన్ సిందూర్’ పరిణామాల తర్వాత పాక్ పేరుతో హెచ్చరికలు రావడంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.
గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధికారిక ఈమెయిల్ ఐడీకి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చినట్లుగా విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నారు. తాము మీ స్టేడియాన్ని పేల్చేస్తామంటూ హెచ్చరికలు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ బెదిరింపులను అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. గుజరాత్ పోలీసులు, సైబర్ క్రైమ్ నిపుణుల బృందం బెదిరింపు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడి నుంచి పంపారో తెలుసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఐపీఎల్లో రెండు కీలకమైన మ్యాచులు రెండురోజుల్లో జరుగనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం స్టేడియం పరిసర ప్రాంతాలతో పాటు, స్టేడియంలోనూ భారీ భద్రతను పెంచారు.