IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18 సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 22న మెగా టోర్నీ షురూ కానున్నది. టోర్నీలో పది జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకు కేవలం ఆరు జట్లు మాత్రమే ఐపీఎల్ టైటిల్‌ను గెలిచాయి. కానీ, ఇప్పటి వరకు నాలుగు జట్లు టైటిల్‌ను గెలవలేకపోయాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం టైటిల్ ఆశలు నెరవేరలేదు. ఈ నాలుగు జట్లు ఈ సారైనా టైటిల్‌ను నెగ్గాలనే కసితో బరిలోకి దిగుతున్నాయి. నాలుగు జట్లు కొత్తగా కెప్టెన్లతో పాటు కోచింగ్ స్టాఫ్‌లోనూ భారీగానే మార్పులు చేశాయి. మరి ఈ సారైనా జట్లకు మార్పులు కలిసి వస్తాయా? లేదా వేచి చూడాల్సిందే. ఈ నాలుగు జట్లలో మూడు మాత్రం ఫైనల్ వరకు చేరినా టైటిల్‌ను సాధించలేకపోయాయి. ఇందులో ఆర్సీబీ ఒకటి. ఇప్పటి వరకు మూడుసార్లు ఫైనల్‌కు చేరుకొని టైటిల్‌ను సొంతం చేసుకోవడంలో విఫలమైంది. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఒక్కోసారి ఫైనల్ చేరాయి. అయితే, లక్నో జట్లు ఫైనల్ అర్హత సాధించలేకపోయింది.
Rajat Patidar
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను ఎంపిక చేసింది. టీమిండియా మాజీ ప్లేయర్ దినేష్ కార్తీక్ మెటార్గా నియమించింది.ఓంకార్ సాల్వి బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. హెడ్‌కోచ్‌గా ఆండీ ఫ్లవర్ వ్యవహరించనున్నాడు. ఈ సారి ఆర్సీబీ ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో సీనియర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్‌లను తీసుకున్నది. ఇద్దరి కోసం రూ.23.25కోట్లు ఖర్చు చేసింది. 2008 నుంచి ఆర్సీబీ తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లీ ఈ సారైన కప్‌ను సాధించిపెట్టాలనే కసితో ఉన్నాడు. ఇటీవల జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన విరాట్.. ఐపీఎల్‌ను ఇదే ఫామ్‌ను కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. విరాట్ అదే ఫామ్‌ను కొనసాగిస్తే మాత్రం ప్రత్యర్థి జట్లకు చుక్కలు కనిపించనున్నాయి.
Rishabh Pant
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ప్రకటించింది. కేఎల్ రాహుల్ స్థానంలో అతనికి జట్టు బాధ్యతలు అప్పగించింది. జెడ్డాలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పోటీపడి రూ.27వేల కోట్లకు తీసుకుంది. లక్నో తరఫున తొలి సీజన్ ఆడుతున్న పంత్‌పై భారీగానే ఒత్తిడి ఉండనున్నది. జట్టు బౌలింగ్ త్రయంలో కీలకమైన మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్, మోహ్సిన్ ఖాన్ ఫిట్నెస్ సందేహాస్పదంగా ఉన్నది. ప్రస్తుతం ఆకాశ్‌దీప్, షమర్ జోసెఫ్, రవి బిష్ణోయ్ మాత్రమే కీలక బౌలర్లు ఉన్నారు. ఇక జహీర్ ఖాన్‌ను ఫ్రాంచైజీ మెంటార్‌గా తీసుకున్నది. జస్టిన్ లాంగర్ హెడ్‌కోచ్‌గా కొనసాగనున్నాడు. రిషబ్ పంత్ సారైనా జట్టు తలరాత మారుస్తాడేమోనని యాజమాన్యం భావిస్తున్నది.
Axar Patel Delhi Capitals
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టీమిండియా ఆల్‌రౌండ్ అక్షర్ పటేల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ సైతం కెప్టెన్సీకి పోటీపడినా.. చివరకు ఆల్‌రౌండర్ వైపే మొగ్గు చూపింది. గత సీజన్ వరకు హెడ్‌కోచ్‌గా పని చేసిన రికీ పాంటింగ్ స్థానంలో హేమంగ్ బదానీని ని తీసుకుంది. ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ కెవిన్ పీటర్సన్‌కు మెంటార్‌గా బాధ్యతలు అప్పగించింది. మాథ్యూ మోట్స్ అసిస్టెంట్ కోచ్‌గా, టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ మునాఫ్ పటేల్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగనున్నాడు. సీనియర్ ప్లేయర్ ఫాఫ్ డ్లు ప్లెసిస్‌కు వైస్ కెప్టెన్సీగా బాధ్యతలు అప్పగించింది.
Shreyas Iyer
గత సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను విజేతగా నిలిపిన శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసింది. జట్టు పగ్గాలు అతనికే అప్పగించింది. అలాగే, జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ మాజీ హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌ను హెడ్‌కోచ్‌గా నియమించింది. శ్రేయాస్, పాంటింగ్ పంజాబ్ భవిష్యత్తును మారుస్తారా? లేదా? వేచి చూడాల్సిందే. ఐపీఎల్ వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ ప్రభ్సిమ్రాన్, శశంకాలను మాత్రమే రీటైన్ చేసుకుంది. రైట్ టు మ్యాచ్ కార్డ్‌ని ఉపయోగించి అర్ష్‌దీప్ సింగ్‌ను రూ.18కోట్లకు తీసుకుంది. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను వేలంలో రూ.18కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్లో 200 వికెట్లు తీసిన ఈ బౌలర్‌ను పోటీపడి దక్కించుకుంది.